
ఇబ్రహీంపట్నం: గర్భిణిని నొప్పులతో ఆస్పత్రికి తీసుకొస్తే.. నర్సులు, ఇతరులు వైద్యం చేసి కవల పిల్లలను బయటకు తీశారు. వైద్యం వికటించి కవలలు చనిపోయారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని విజయలక్ష్మి ఆసుపత్రిలో ఈ దారుణం జరిగింది. విజయ లక్ష్మి ఆసుపత్రి డాక్టర్ అనూష రెడ్డి దగ్గర గత 5 నెలలుగా ఎలిమినేడు గ్రామానికి చెందిన బట్టి కీర్తి చికిత్స చేయించుకుంటోంది.
పెళ్ళైన 7 ఏండ్ల తర్వాత గర్భం దాల్చింది. కడుపులో కవలలు ఉన్నారని, ఎలాంటి పనులు చేయవద్దని బెడ్ రెస్ట్ ఉండాలని సూచిస్తూ డాక్టర్ కొన్ని కుట్లు వేశారు. కాగా ఆదివారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో గర్భిణీ బట్టి కీర్తికి తీవ్రంగా నొప్పులు రావడంతో బంధువులు మళ్లీ ఆసుపత్రికి తరలించారు.
►ALSO READ | ఇద్దరు పిల్లలను చంపి ఉరేసుకున్న తండ్రి.. ఇంట్లోనే కుళ్లిపోయిన మృతదేహాలు
తెల్లవారుజాము నుంచి డాక్టర్ ఆస్పత్రిలో అందుబాటులో లేకుండా, కేవలం సిస్టర్లతో ఫోన్లో, వాట్సాప్లో మాట్లాడుతూ, వీడియో కాల్లో వైద్యం అందించింది. ఉదయం 10.30 గంటలకు 5 నెలల గర్భిణి గర్భసంచి నుంచి కవల పిల్లలను బయటకు తీశారు. తీవ్ర రక్తస్రావం అయ్యింది. ఉదయం11 గంటలకు వచ్చిన డాక్టర్ కవలలు మరణించారని చెప్పారు. డాక్టర్ అందుబాటులో లేకపోవడం, నిర్లక్ష్యం వల్ల, సిస్టర్లు, సహాయకుల వైద్యం వల్లనే ఇలా జరిగిందని బాధిత కుటుంభ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.