పాకిస్తాన్లో భూకంపం.. భయంతో ఇళ్ల నుంచి జనం పరుగులు.. వారంలో రెండోసారి..

పాకిస్తాన్లో భూకంపం.. భయంతో ఇళ్ల నుంచి జనం పరుగులు.. వారంలో రెండోసారి..

ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడితో కయ్యానికి కాలు దువ్వి యుద్ధ భయంతో వణికిపోతున్న పాకిస్తాన్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 4.2 తీవ్రతతో సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో పాకిస్తాన్లో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) పేర్కొంది. పాకిస్తాన్లో భూకంపం సంభవించడం వారం వ్యవధిలో ఇది రెండోసారి కావడం గమనార్హం.

ఏప్రిల్ 30వ తేదీన కూడా పాకిస్తాన్లో భూకంపం కారణంగా కొంత భూభాగం కుదుపునకు లోనైంది. పాకిస్తాన్లో ఇటీవల తరచుగా భూకంపాలు సంభవిస్తుండటం గమనార్హం. 2005లో పాకిస్తాన్లో సంభవించిన భారీ భూకంపం కారణంగా 74 వేల మంది చనిపోయారు. అసలే.. పహల్గాం ఉగ్రదాడి అనంతర పరిణామాలతో పాకిస్తాన్ ప్రజలు యుద్ధ భయంతో వణికిపోతుంటే భూకంపం మరింతగా బెంబేలెత్తించింది.

ఇక.. యుద్ధం విషయానికొస్తే.. పాకిస్తాన్కు ఇండియాతో యుద్ధం చేయాల్సి వస్తే.. ఆ దేశం వద్ద సరిపడా ఆయుధాల్లేవని తెలుస్తున్నది. కేవలం 4 రోజులకు సరిపడా శతఘ్ని గుండ్లు (యాంటీ -ఏయిర్‌‌క్రాఫ్ట్ గన్ అమ్యునిషన్) మాత్రమే ఉన్నట్లు ఓ నేషనల్ మీడియా స్పష్టం చేసింది. ఇండియాతో పాకిస్తాన్ దీటుగా పోరాడలేదని, కొద్ది రోజుల్లోనే వెనుకడుగు వేసే పరిస్థితి ఉంటుందని తెలిపింది. పాకిస్తాన్ ఆర్మీకి కీలక ఆయుధాలు, బుల్లెట్లు సరఫరా చేయడంలో పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ (పీవోఎఫ్) తీవ్రంగా విఫలమైంది. ప్రపంచవ్యాప్తంగా ఆయుధాలకు డిమాండ్ పెరగడమే దీనికి కారణమని తెలుస్తున్నది.

ALSO READ | పాక్కు దెబ్బ మీద దెబ్బ.. పెద్దగా ప్లాన్ చేసిన కేంద్రం.. కశ్మీర్ సీఎంతో కూడా మాట్లాడిన ప్రధాని

దీనికి తోడు పీవోఎఫ్.. వద్ద ఆయుధాల తయారీకి సౌకర్యాల్లేవు. 15 ఎంఎం ఆర్టిలరీ షెల్స్​ను పాకిస్తాన్ ఇటీవల ఉక్రెయిన్​కు అమ్ముకోవడంతో తీవ్ర కొరత నెలకొన్నది. ఇప్పుడు ఉన్నవి కేవలం 96 గంటలకు మాత్రమే సరిపోతాయని ఓ నివేదిక వెల్లడించినట్లు తెలుస్తున్నది.