కాళేశ్వరం నేడే ప్రారంభం

కాళేశ్వరం నేడే ప్రారంభం

ప్రాజెక్టుకు కన్నెపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్​ స్విచ్​ ఆన్​

ఉదయం 10.30 గంటలకు ముహూర్తం

జలహోమంలో పాల్గొననున్న సీఎం దంపతులు

ముఖ్య అతిథులుగా గవర్నర్ నరసింహన్​,
ఏపీ, మహారాష్ట్ర సీఎంలు జగన్‌, ఫడ్నవీస్

4 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు

మొత్తం 16 హెలిప్యాడ్లను సిద్ధం చేసిన అధికారులు

హైదరాబాద్‌‌, జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు:ఇంజనీరింగ్‌ అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధమైంది. మూడే మూడేండ్లలో పూర్తయిన రికార్డు సృష్టించిన ఈ భారీ ఇరిగేషన్​ ప్రాజెక్టు రిబ్బన్‌‌ కటింగ్‌‌కు రెడీ అయింది. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ కన్నెపల్లి పంప్​హౌస్​ వద్ద గవర్నర్​ సమక్షంలో ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌‌, ఏపీ సీఎం వైఎస్‌‌ జగన్మోహన్‌‌రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. కన్నెపల్లి పంప్‌‌హౌస్‌‌ వద్దే ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌‌, శోభ దంపతులు హోమం నిర్వహిస్తారు.

ఉదయం 7.30 గంటలకే సీఎం రాక

సీఎం కేసీఆర్‌‌ ఉదయం 6.30 గంటలకు బేగంపేట ఎయిర్‌‌పోర్టు నుంచి బయల్దేరి 7.30 గంటలకు మేడిగడ్డ చేరుకుంటారు. తర్వాత రెండు గంటలపాటు జలహోమంలో పాల్గొంటారు. 9.30 గంటల సమయంలో గవర్నర్‌‌ నరసింహన్‌‌, ఏపీ, మహారాష్ట్ర సీఎంలు వైఎస్‌‌ జగన్మోహన్‌‌రెడ్డి, దేవేంద్ర ఫడ్నవీస్‌‌ చేరుకొని హోమంలో పాల్గొంటారు. 10 గంటలకు మేడిగడ్డ బ్యారేజీపైకి చేరుకొని సీఎం కేసీఆర్‌‌ ఒకటో నంబర్‌‌ గేటును ఎత్తి కిందకు నీటిని వదులుతారు.

గవర్నర్‌‌ రెండో నంబర్‌ గేటును, ఇరు రాష్ట్రాల సీఎంలు మూడు, నాలుగో నంబర్‌ గేట్లను ఎత్తుతారు. అక్కడ్నుంచి హెలికాప్టర్లలో కన్నెపల్లి పంపుహౌస్‌ వద్దకు చేరుకుంటారు. సీఎం కేసీఆర్‌ ఆరో నంబర్‌ మోటారును స్విచ్‌ ఆన్‌ చేసి లాంఛనంగా కాళేశ్వరం ఎత్తిపోతలను ప్రారంభిస్తారు. ఈ మోటార్‌ను బుధవారమే ట్రయల్‌ రన్‌ చేసి అధికారులు పరీక్షించారు. గవర్నర్‌, ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు, అతిథుల తరలింపునకు ప్రభుత్వం ఐదు హెలిక్యాప్టర్లను వినియోగిస్తోంది.

మంత్రులు బిజీబిజీ

మేడిగడ్డ ప్రధాన బ్యారేజీ వద్ద పనులను మంత్రి ఈటెల రాజేందర్‌ పర్యవేక్షిస్తుండగా, కన్నెపల్లి పంపుహౌస్‌ వద్ద మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు సాగుతున్నాయి. మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, వి. శ్రీనివాస్‌గౌడ్‌లకు గవర్నర్‌, సీఎంలకు స్వాగతం పలకడం, అన్నారం, సుందిళ్ల, బ్యారేజీలు, అన్నారం, గోలివాడ పంపుహౌస్‌ల వద్ద పూజలు చేసే బాధ్యతను సీఎం అప్పగించారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఎనిమిది, కన్నెపల్లి పంపుహౌస్‌ వద్ద మరో ఎనిమిది హెలిప్యాడ్లను సిద్ధం చేశారు. ఇరు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అనుగుణంగా అప్రోచ్‌ రోడ్లను వేశారు.

4 వేల మంది పోలీసులతో బందోబస్తు

మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్‌ వద్ద 4 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడ్రోజులుగా పోలీసులు అడవులను జల్లెడ పడుతున్నారు. పర్యాటకులను కూడా రానివ్వడం లేదు. ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొనే వీఐపీలను తరలించేందుకు ఏసీ బస్సులను సిద్ధంగా ఉంచారు. ప్రాజెక్టు నిర్మాణానికి రుణాలిచ్చిన కార్పొరేషన్లతోపాటు బ్యాంకుల ఉన్నతాధికారులు గురువారమే బ్యారేజీలు, పంపుహౌస్‌లు, టన్నెళ్లు, అప్రోచ్‌ చానళ్లను పరిశీలించారు. వీరందరినీ  ప్రాజెక్టు ప్రారంభోత్సవం తర్వాత సీఎం కేసీఆర్‌ సన్మానించనున్నారు. ప్రాజెక్టు ప్రారంభానికి ఆహ్వానించిన అతిథులు, నిర్మాణంలో పాలు పంచుకున్న ఇంజనీర్లు, వర్క్‌ ఏజెన్సీలకు సత్కరించనున్నారు. ఆహ్వానితులకు మేడిగడ్డ బ్యారేజీ వద్ద లంచ్‌ ఏర్పాటు చేశారు  ఇందుకోసం ప్రత్యేకంగా వంటశాల ఏర్పాటు చేశారు. తెలంగాణ సంప్రదాయ వంటలను విందులో వడ్డించనున్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం గవర్నర్‌, సీఎంలు అక్కడ్నుంచి తిరుగు ప్రయాణం అవుతారు.

గాలివాన బీభత్సం

ప్రాజెక్టు వద్ద గురువారం గాలివాన బీభత్సం సృష్టించింది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద రోడ్లన్నీ బురదమయమయ్యాయి. హోమశాల తడిసింది. కన్నెపల్లి వద్ద ఈదురు గాలులు వీయడంతో యాగశాలపై వేసిన రేకులు లేచి కిందపడ్డాయి. వాన తగ్గాక పనుల్లో నిమగ్నమయ్యారు.

మీడియాకు నో ఎంట్రీ

ప్రాజెక్ట్‌ ఓపెనింగ్‌కు మీడియాను అనుమతించడం లేదు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, వార్తలన్నీ తామే అందజేస్తామని అధికారులు వివరించారు.