ఢిల్లీకి బయలుదేరిన కాళేశ్వరం ముంపు బాధితులు

ఢిల్లీకి బయలుదేరిన కాళేశ్వరం ముంపు బాధితులు
  • కాళేశ్వరం బ్యాక్ వాటర్ నష్టాలకు పరిహారం ఇవ్వడం లేదు
  • నాలుగేళ్లుగా 15వేల ఎకరాల పంట నష్టపోతున్నాం

మంచిర్యాల జిల్లా: కాళేశ్వరం ప్రాజెక్టు నీటి మునక బాధితులు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మంచిర్యాల రైల్వే స్టేషన్ నుండి ట్రైన్ లో ఢిల్లీకి పయనమయ్యారు. రేపు ఉదయం బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రులను కలసి తమ కష్టాలు చెప్పుకోనున్నారు. 

ఢిల్లీకి వెళ్లిన వారిలో  చెన్నూరు, జైపూర్, కోటపల్లి మండలాలకు చెందిన కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంపు రైతులు, బీజేపీ నాయకులు ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల 15వేల ఎకరాలకు పైగా పంట నష్టపోతున్నా.. ప్రభుత్వం పరిహారం చెల్లించడం లేదని వాపోయారు. ఎమ్మెల్యేలు, ప్రభుత్వానికి తెలియజేసినా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

గత నాలుగేళ్లుగా కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల 15వేల ఎకరాల పంట నష్టపోతున్నామని మొత్తుకుంటున్నా ప్రభుత్వం, నాయకులు ఎవరూ పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ ను కలిసి ఆమె ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సమస్యను తెలియజేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో న్యాయం జరగడం లేదని చివరకు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలసి తమకు మాకు జరుగుతున్న నష్టాలను తెలియజేస్తామన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రులను కలిసి తమ కష్టాలను తెలియజేసుకుంటామని కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంపు బాధితులు తెలియజేశారు.