
మంచిర్యాల/చెన్నూర్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ మంచిర్యాల జిల్లా రైతులకు మరోసారి కన్నీళ్లు మిగిల్చింది. పది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు గోదావరికి వరద పోటెత్తడంతో జన్నారం మొదలు కోటపల్లి వరకు నదీ తీర ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. చెన్నూర్, కోటపల్లి, జైపూర్ మండలాల్లో పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 30 వేల ఎకరాల్లో పత్తి, ఇతర పంటలు పాడైపోయాయి. ఈసారి ఎన్నో ఆశలతో పత్తి సాగు చేసిన రైతులు ఇప్పటికే ఎకరానికి రూ.20వేల దాక ఖర్చుపెట్టారు. చేన్లు నీటమునిగి ఉండడంతో మొలకలు మురిగిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చెన్నూర్, కోటపల్లి, జైపూర్ మండలాల్లో భారీ నష్టం
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో చెన్నూర్మండలంలోని చెన్నూర్ , సుందరశాల, ముత్తారావుపల్లె, నర్సక్కపేట వెంకంపేట, దుగ్నెపల్లి, అక్కెపల్లి, చింతలపల్లి, పొక్కూరు, బీరెల్లి, నాగాపూర్, నారాయణపూర్, సోమన్ పల్లి గ్రామాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కోటపల్లి మండలంలో కొల్లూరు, రాంపూర్ , పాత దేవులవాడ, కొత్త దేవులవాడ, బబ్బెరచెలుక, అర్జునగుట్ట, రాపన్ పల్లి, జైపూర్ మండలంలో వేలాల, శివ్వారం, టేకుమట్ల, ఇందారం గ్రామాల్లో పత్తి చేలు దెబ్బతిన్నాయి. అలాగే జన్నారం మండలంలో చింతగూడ, బాదంపల్లి, తిమ్మాపూర్, రాంపూర్, దండేపల్లి మండలంలో గుడిరేవు, ద్వారక, వెల్గనూర్, నంబాల, గూడెం.. లక్సెట్టిపేట మండలంలో ఇటిక్యాల, హాజీపూర్ మండలంలో ముల్కల్ల, వేంపల్లి, గొల్లపల్లి గ్రామాల్లో పంటలు వరదలో మునిగాయి. నెలరోజుల కిందటే పత్తి పంట వేశామని, మొక్కలు మంచిగా పెరుగుతున్న తరుణంలో గోదావరి ముంచిందని రైతులు వాపోతున్నారు.
ఆఫీసర్లు సర్వే చేస్తున్నప్పటికీ..
కాళేశ్వరం బ్యారేజీల బ్యాక్ వాటర్‌వల్ల జిల్లాలోని గోదావరి తీర ప్రాంతాల్లో గత నాలుగేండ్లుగా వేలాది ఎకరాలో పంటలు మునిగిపోతున్నాయి. జూన్, జూలైలో పంటలు వేసిన నెలరోజులకే వరదలు వచ్చి రైతులను నట్టేట ముంచుతున్నాయి. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నష్టపరిహారం అందించలేదు. గతంలో అగ్రికల్చర్ఆఫీసర్లు సర్వే చేసి సర్కారుకు రిపోర్టు పంపినప్పటికీ పైసా పరిహారం రాలేదు. దీంతో అప్పులపాలైన పలువురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ముంపు రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్, బీజేపీ నేతలు డిమాండ్లు చేస్తున్నా సర్కారు స్పందించలేదు. ఈసారైనా నష్టపరిహారం అందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
నాలుగు ఎకరాల్లో పత్తి నష్టం
నేను ఈ ఏడాది నాలుగు ఎకరాల్లో పత్తి పంట వేసిన. ఇప్పటిదాక ఎకరానికి రూ.20 వేలు పెట్టుబడి పెట్టిన. భారీ వర్షాలకు గంగ పొంగి పత్తి చేను పూర్తిగా మునిగిపోయింది. సర్కారు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలె.
సంగ వెంకటేశ్, కలమడుగు, జన్నారం మండలం
నష్టపోతూనే ఉన్నాం..
కాళేశ్వరం బ్యాక్ వాటర్‌వల్ల నాలుగేండ్లుగా పంటలు నష్టపోతున్నం. ఈసారి 16 ఎకరాల్లో పత్తి వేసిన. పెట్టుబడి రూ.2లక్షలకు పైగానే అయ్యింది. మొక్కలు మురిగిపోతున్నయ్. మమ్మల్ని ఆదుకోవాలె.
రాంగోపాల్‌రెడ్డి, సుందరశాల, చెన్నూర్మండలం