
- కాళేశ్వరం బాకీ ఎప్పుడో .. తీరిపోయింది
- తలసరి ఆదాయంలో మనం నంబర్ వన్: కేసీఆర్
- రాష్ట్రంలో ఉష్కె లెక్క వడ్లు పండుతున్నయ్
- రైతుల జేబుల్లో డబ్బులు కనిపిస్తున్నయ్
- దేశంలో ఎక్కడ లేని కరెంట్ ఇక్కడ ఇస్తున్నం
- ధరణి లేకపోతే రైతు బంధు పైసలెట్ల పడ్తయని ప్రశ్న
- బీఆర్ఎస్లో చేరిన యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు అనిల్
హైదరాబాద్, వెలుగు: రూ. 80 వేల కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టామని, దాని బాకీ ఎప్పుడో తీరిపోయిందని సీఎం కేసీఆర్ అన్నారు. తలసరి ఆదాయంలో దేశంలోనే రాష్ట్రం నంబర్ వన్ అయిందని చెప్పారు. రైతుల కోసం 24 గంటల ఫ్రీ కరెంట్, రైతుబంధు, రైతు బీమా ఇస్తున్నామని తెలిపారు. రైతులకు 24 గంటల కరెంట్ ఇండియాలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వడం లేదని, వాగ్దానాలు చేసినోళ్లు కూడా నెరవేర్చలేదని అన్నారు. యాదాద్రి భువనగిరి డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్ రెడ్డితో పాటు పలువురు సర్పంచులు సోమవారం ప్రగతి భవన్లో బీఆర్ఎస్లో చేరారు. వారికి కేసీఆర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు 24 గంటల కరెంట్‌ఇవ్వడం చాలా కఠినమైన పని అన్నారు. ‘‘రాష్ట్రంలో ఒక్కోసారి మూడు మూడు కోట్ల టన్నుల పంటలు పండుతున్నయ్. ఉష్కె పండినట్లే వడ్లు పండుతున్నయ్. కల్లాల సమయంలో హెలిక్యాప్టర్ల పోవుకుంట ఎక్కడ చూసిన గని వడ్లకుప్పలే కనిపిస్తున్నయ్. దాన్ని చూస్తే గుండెలు ఉప్పొంగుతయ్.. యస్.. దీని కోసమే తెలంగాణ తెచ్చుకున్నం అనిపిస్తది” అని తెలిపారు. ‘‘రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని ఇక్కడి గిర్నీలు పట్టలేకపోతున్నయ్. అందుకే సటాకే మిల్లులు ఏర్పాటు చేయిస్తున్నం” అని కేసీఆర్ తెలిపారు.
మూడు గంటలే కరెంట్ అంటే తిడుతున్నరు
రాష్ట్రంలో రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నామని కేసీఆర్ తెలిపారు. ‘‘మూడు గంటలే కరెంట్అంటే రైతులు తిడుతున్నరు.. మూడు గంటలు యాడ పోస్తరు అని అడుగుతున్నరు” అని కాంగ్రెస్‌ను విమర్శించారు. 24 గంటల కరెంట్ ఇస్తే భూగర్భ జలాలు లేకుంటా పోతయేమోనని అప్పట్ల కొందరు రైతులు తనతో అన్నారని, మిషన్‌కాకతీయతో 46 వేల చెరువులను మంచిగ చేసుకొని వాటి సామర్థ్యం పెంచుకున్నామని తెలిపారు. విద్యుత్ రంగంలో ఐఏఎస్‌లు లేరని చెప్పారు. కంప్లీట్టెక్నోక్రాట్స్మీద ఆధారపడి చేస్తున్నాం కాబట్టి బ్రహ్మాండంగా కరెంట్ సరఫరా జరుగుతున్నదని చెప్పారు. మొత్తం భారతదేశంలోనే ఎక్కడాలేని కరెంట్ఇయ్యాళ తెలంగాణలోనే ఇయ్యగలుగుతున్నామని తెలిపారు. ‘‘ఐఏఎస్అధికారులు ఇతర రంగాల్లో పనిచేస్తున్నరు. అక్కడ కూడా పని బ్రహ్మాండంగా జరుగుతా ఉన్నది” అని చెప్పారు.
కుదురుకున్నాక అవి ఇవ్వకపోయినా పర్వాలేదు
రాష్ట్రంలో తమ ప్రభుత్వం వల్లే రైతుల జేబుల్లో డబ్బులు కనిపిస్తున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. ‘‘కొందరు ఎకానమిస్టులు వ్యవసాయానికి ఇంత డబ్బు ఖర్చు చేస్తరా.. అని నన్ను ప్రశ్నించిన్రు. ఎకరానికి రూ.10 వేల రైతుబంధు ఇస్తున్నరు.. ఎవరన్నా చచ్చిపోతే డబ్బు కడ్తున్నరు అని అన్నరు. తెలంగాణ రైతులు ఆగమైండ్రు కాబట్టే వాళ్లు కుదురుకునే దాకా, గ్రామీణ ప్రాంతాలు కళకళలాడే దాకా ఇవన్నీ ఇస్తున్నం.. ఆ తర్వాత ఇవన్నీ ఇవ్వకున్నా పర్వాలేదని ఆ ఎకానమిస్టులకు చెప్పిన. మేము ఇవన్నీ చేస్తేనే వ్యవసాయం ఇప్పుడిప్పుడే తెల్లబడుతున్నది. రైతుల జేబుల డబ్బులు కనబడ్తున్నయ్? ఇది అర్థం కానోళ్లకు కానే కాదు. పంటలు మంచిగ పండితే సావుకార్ల గల్లాల డబ్బులు కనిపిస్తయ్. ఆ డబ్బు అనేక రకాలుగా మళ్లీ మార్కెట్లోకే వస్తది. దీన్నే స్పిన్ఆఫ్ఎకానమీ అంటరు” అని పేర్కొన్నారు. ధాన్యం కొని అమ్మితే నష్టం వస్తుందని, అయినా రైతుల కోసం కొంటున్నామని తెలిపారు.
ప్రాణం పోయినా వెనక్కి పోను
కుంభం అనిల్‌కుమార్ భవిష్యత్‌కు తనది జిమ్మేదారి అని కేసీఆర్ అన్నారు. ‘‘నేను ఒక్కసారి మాట చెప్పిన్నంటే ప్రాణం పోయినా వెనక్కి పోయేది ఉండదు. లీడర్లు పాత కొత్త తేడా లేకుండా పని చేయాలి” అని చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ధరణిని తీసేస్తే రైతుబంధు పైసలు ఎట్ల పడ్తయ్?
‘‘కొందరు తెలిసీ, తెల్వక, తెలివిలేక ఏదేదో మాట్లాడ్తుంటరు. నేను పట్టించుకోను” అని కేసీఆర్ అన్నారు. ధరణితో వ్యవసాయ భూ ములు డిజిటలైజ్చేశామని, ధరణితో భూయ జమానులు మాత్రమే తమ భూమిని ఇతరుల పేరు మీదికి మార్చగలుగుతారని తెలిపారు. దీనిని తీసేస్తే రైతుబంధు పైసలు ఎట్ల పడుతా యని ప్రశ్నించారు. రాష్ట్రంలో భూముల విలు వ భారీగా పెరిగిందని చెప్పారు. త్వరలోనే బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. బీఆర్ఎస్ రాజకీయం కోసం కాకుండా తెలంగాణ లక్ష్య సాధన కోసం ఉద్భవించిందని ఆయన తెలిపారు.