
కాళేశ్వరం ముంపు గ్రామాల్లో అడుగడుగునా పోలీసులను మోహరించారు. ముంపు బాధితులకు పరిహారం పంపిణీ సందర్భంగా ఎక్కడా నిరసనలు వ్యక్తం కాకుండా చర్యలు తీసుకున్నారు. ఓ వైపు ప్రశ్నిద్దామనే ఆవేశం ఉన్నా పోలీసుల హెచ్చరికలతో పల్లెత్తు మాట మాట్లాడలేని పరిస్థితి. మరోవైపు పరిహారం అందుకుంటున్న పెద్దల దబాయింపు ఆ రెండు గ్రామాల్లోని యువతను కట్టిపడేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు గ్రామాలైన తొగుట మండలం వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామాల్లో నెలకొన్న పరిస్థితి ఇది. బుధవారం తొగుట మండలం వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్‌లో పోలీసు బలగాల బందోబస్తు మధ్య గ్రామసభలు నిర్వహించారు. పోలీసులు చాలామందిని బయటికి రానివ్వలేదు. కొందరికి ఇళ్ల నుంచి బయటికి రావద్దని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో వారు గ్రామంలో ఎక్కడా కనిపించలేదు. కొందరిని షాడో పార్టీలు వెంటాడాయి. గ్రామసభలకు హాజరు కావాలంటే ముందుగా ఎస్సై అనుమతి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కొందరు యువకులు కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లినా పోలీసుల నిఘా కనిపించింది. అన్యాయాన్ని ఎలుగెత్తి చాటుదామనుకున్న యువతను గ్రామసభలు, పరిహారాల పంపిణీ వైపు రానివ్వలేదు. చివరకు వేములఘాట్‌లో ఓ యువకుడిని పోలీసులు హౌస్ అరెస్ట్‌చేశారు.
ఇంటి వద్ద మఫ్టీలో…
రైతు కూలీల పరిహారం కోసం హైకోర్టులో కేసు వేసిన ఏటిగడ్డ కిష్టాపూర్‌కు చెందిన నాయిని సరితను పోలీసులు ఇల్లు దాటనివ్వలేదు. బుధవారం గ్రామసభ నిర్వహిస్తుండటంతో మఫ్టీలో పోలీసులు రోజంతా ఆమె ఇంటి వద్ద నిఘా వేశారు. ఆమె ప్రతి కదలికను గమనించి ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా చూశారు. ఉదయం నుంచే తన ఇంటి వద్ద పోలీసులు పహారా కాశారని, ఇలాంటి పరిస్థితుల మధ్య గ్రామసభకు వెళ్లి ఏమని ప్రశ్నిస్తామని ఆవేదన వ్యక్తం చేసింది. కోర్టులో కేసు వేసినందున ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ జాబితాలో పేరున్నా చెక్కును తీసుకోలేదని సరిత వెల్లడించింది. కొందరు యువకులు తాము ఊరిలోకి వెళ్తే పోలీసులు అదుపులోకి తీసుకుంటారనే ఆందోళనతో గ్రామ పొలిమేరలోనే కాలక్షేపం చేశారు.