ఊరూరా పండుగ చేసుకోండి

ఊరూరా పండుగ చేసుకోండి

ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరాన్ని ఈ నెల 21న ప్రారంభించబోతున్నాం. రాష్ట్రంలోని 80 శాతం జిల్లాలకు సాగు, తాగు నీరిచ్చే ఈ భారీ ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా పండుగలా నిర్వహించుకోవాలి. అన్ని గ్రామాల్లో టీఆర్‌‌ఎస్‌‌ శ్రేణులు, ప్రజలు పండుగ చేసుకోవాలి. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లోనే ఉండి ఉత్సవాల్లో పాల్గొనాలి. వీలైనన్ని చోట్ల టపాసులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేయాలి.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి శుభసూచకంగా రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో పండుగ చేసుకోవాలని టీఆర్‌‌ఎస్‌‌ శ్రేణులు, ప్రజలను సీఎం కేసీఆర్‌‌ కోరారు. అందరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోనే ఉండి ఉత్సవాల్లో పాల్గొనాలని ఆదేశించారు. బుధవారం తెలంగాణ భవన్‌‌లో కేసీఆర్‌‌ అధ్యక్షతన టీఆర్​ఎస్​ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. అందులో కేసీఆర్​ గంటా 20 నిమిషాల పాటు మాట్లాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరాన్ని ఈ నెల 21న ప్రారంభించబోతున్నామని చెప్పారు. రాష్ట్రంలో 80 శాతం జిల్లాలకు సాగు, తాగు నీరిచ్చే ఈ భారీ ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా పండుగలా నిర్వహించుకోవాలన్నారు. వీలైనన్ని చోట్ల టపాసులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేయాలని సూచించారు.

అతికొద్ది మందితో ప్రారంభోత్సవం..

ప్రాజెక్టు ప్రాంతానికి ఎక్కువ మంది వచ్చిపోవడానికి వీలుకాదని, అందువల్ల కొద్దిమందితోనే ప్రాజెక్టును ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్​ చెప్పారు. ప్రాజెక్టు వద్దకు రావడానికి ఎవరూ ప్రయత్నించవద్దని, అవసరమైతే ప్రారంభం తర్వాత వెళ్లి చూసిరావాలని సూచించారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవం బాధ్యతలు అప్పగించిన మంత్రులు, ఇతర నేతలు మినహా మిగతా వారంతా గ్రామాలు, పట్టణాల్లోనే ఉత్సవాల్లో పాల్గొనాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలను ఊరూరా వివరించాలని, ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా బదులివ్వాలని సూచించారు.

పార్టీని పటిష్టం చేస్తం..

దేశంలో టీఆర్‌‌ఎస్‌‌ అంత బలమైన పార్టీ మరొకటి లేదని కేసీఆర్​ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం, లోక్​సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించడం, మొత్తం జడ్పీలను స్వీప్‌‌ చేయడాన్ని బట్టి ప్రజలకు టీఆర్​ఎస్​పై ఎంత నమ్మకముందో అర్థమవుతోందని పేర్కొన్నారు. 2001లో పార్టీని స్థాపించి, అనేక కష్టనష్టాల కోర్చి, ఆటుపోట్లను అధిగమించి 2014లో అనుకున్న లక్ష్యాన్ని సాధించామన్నారు. 2019కి వచ్చే సరికి రాష్ట్ర ప్రజలతో విడదీయరాని బంధం ఏర్పడిందని చెప్పారు. టీఆర్‌‌ఎస్‌‌ పార్టీ తమకు రక్షణ ఇస్తుందని ప్రజలు నమ్మకం పెట్టుకున్నారని, వారి విశ్వాసానికి అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీ వందేళ్ల పాటు నిలిచి ఉండేలా పటిష్టంగా నిర్మాణం చేస్తామన్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో ఉండి ఎంపీలుగా గెలిచిన మాలోతు కవిత, పోతుగంటి రాములు, ఎమ్మెల్సీలుగా విజయం సాధించిన శేరి సుభాష్‌‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌‌, జడ్పీ చైర్మన్లుగా ఎన్నికైన విఠల్‌‌రావు, రోజా శర్మ (రాధాకృష్ణశర్మ)ను కేసీఆర్‌‌ అభినందించారు.

27 నుంచి పార్టీ సభ్యత్వాలు…

ఈ నెల 27వ తేదీ నుంచి టీఆర్​ఎస్​ సభ్యత్వ నమోదు మొదలవుతుందని కేసీఆర్‌‌ తెలిపారు. కొత్త సెక్రటేరియట్‌‌, అసెంబ్లీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన తర్వాత.. తెలంగాణ భవన్‌‌లో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో సంయుక్త సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఆ సమావేశంలోనే పార్టీ అధ్యక్షుడిగా తాను తొలి సభ్యత్వం తీసుకుని మెంబర్‌‌షిప్‌‌ డ్రైవ్‌‌ను ప్రారంభిస్తామని వివరించారు. జులై 20 నాటికి మెంబర్‌‌షిప్‌‌ డ్రైవ్‌‌ పూర్తి చేసి.. ఆ నెలాఖరుకు గ్రామ కమిటీలు, అనుబంధ సంఘాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కనీసం 80 లక్షల సభ్యత్వాలను టార్గెట్‌‌ పెట్టుకొని పనిచేయాలన్నారు. సభ్యత్వ నమోదును పర్యవేక్షించడానికి పార్టీ జిల్లా కార్యవర్గం నుంచి రెండు సెగ్మెంట్లకో ఇన్‌‌చార్జిని త్వరలో నియమిస్తామన్నారు. గ్రామ కమిటీల ఏర్పాటు తర్వాత కార్యకర్తలకు శిక్షణ, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 27న నిర్వహించే సమావేశంలో మళ్లీ మాట్లాడుతానని, కార్యకర్తల సంక్షేమానికి ఏమేం చేయబోతున్నామో అప్పుడే వివరిస్తామని చెప్పారు.

మున్సిపల్​ చైర్మన్లను నేరుగా ఎన్నుకోవాలె!..

తెలంగాణ భవన్లో భేటీ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు పలు అంశాలను సీఎం కేసీఆర్‌‌ దృష్టికి తీసుకుపోయినట్టు తెలిసింది. మున్సిపల్‌‌ చైర్మన్లను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలని, దాంతో రాజకీయ కొనుగోళ్లకు అడ్డుకట్ట వేయడంతోపాటు పార్టీ
కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు అవకాశం దక్కుతుందని పలువురు చెప్పినట్టు సమాచారం. దీనిపై స్పందించిన సీఎం.. ఈ విషయమై అధ్యయనం చేయాలని మాజీ ఎంపీ బి.వినోద్‌‌కుమార్‌‌కు సూచించినట్టు తెలిసింది. ఇక నామినేటెడ్‌‌ పదవుల్లో పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులకు ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైన వారికి హైదరాబాద్‌‌లో నివాసం ఉండేందుకు ఫ్లాట్లు కేటాయించాలని మరికొందరు కోరగా.. నామినేటెడ్‌‌ భర్తీలో తొలి అవకాశం రాష్ట్ర నాయకత్వానికే ఇస్తామని కేసీఆర్​ చెప్పినట్టు సమాచారం.