
కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు బయటపడుతున్నాయి. ప్రాజెక్టులో భాగమైన రామడుగు మండలం లక్ష్మీ పూర్ 8వ ప్యాకేజీలోని పంప్ హౌజ్ లో వాటర్ లీకవుతోంది. నీరు ఎత్తిపోసే చోట వెనుకభాగానే మూడు మీటర్ల మేర పంప్ హౌస్ గోడకు పగుళ్లు ఏర్పాడ్డాయి. దీనితో వాటర్ లీకవుతోంది. వెంటనే అప్రమత్తమైన ఇంజనీరింగ్ అధికారులు లోపాన్ని సరిచేసే పనిలో పడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోనే ఈపంప్ హౌస్ కీలకమైంది. ఇక్కడి భూగర్భంలో 139 మెగావాట్లు కలిగిన ఏడు బాహుబలి మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. ప్రపంచంలోని ఈమోటార్లు అత్యంత సామర్థ్యం కలిగినవి కావడంతో వీటిని బాహుబలి మోటార్లుగా పిలుస్తున్నారు. భూగర్భంలోని 117 మీటర్ల లోతులోనుంచి ఈమోటార్లు రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోస్తాయి. ఇప్పటికే మూడు మోటార్లకు ట్రయల్ రన్ పూర్తయింది. ప్రస్తుతం ట్రయల్ రన్ నిరాటంకంగా కొనసాగుతోంది. ఏడు మోటార్లకు ట్రయల్ రన్ పూర్తయ్యాక ముఖ్యమంత్రి కేసీఆర్ ఈపంప్ హౌస్ ను ప్రారంభించనుండటంతో అందరి దృష్టి ఇప్పుడు లక్ష్మీపూర్ లోని గాయత్రి పంప్ హౌస్ పైనే ఉంది.