నాలుగేండ్లు కూడా నిలబడని కాళేశ్వరం పనులు: పొన్నం ప్రభాకర్

నాలుగేండ్లు కూడా నిలబడని కాళేశ్వరం పనులు: పొన్నం ప్రభాకర్

మహదేవపూర్, వెలుగు: కాంగ్రెస్ హయాంలో నిర్మించినవి ఉక్కు కట్టడాలని, ఇప్పటికీ చెక్కుచెదరలేదని ఆ పార్టీ సీనియర్ లీడర్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత  కట్టిన ప్రాజెక్టులు నాలుగేండ్లు కూడా నిలవకుండా నేల కూలుతున్నాయని విమర్శించారు. తానే ఇంజనీర్ గా మారి కాళేశ్వరం రీ డిజైన్ చేసినట్టు.. తన ఆధ్వర్యంలోనే నిర్మాణం చేపట్టినట్టు అసెంబ్లీలో గొప్పలు చెప్పుకున్న కేసీఆర్.. ఇప్పుడు తప్పిదాలను కప్పిపుచ్చేందుకు కుట్రకోణం అంటూ ఆఫీసర్లతో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇప్పించారని ఎద్దేవా చేశారు. 

బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ లో కుంగిన వంతెన, పిల్లర్లను సందర్శించేందుకు   హుస్నాబాద్ నుంచి నాలుగు బస్సుల్లో 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలతో వచ్చారు. అయితే ఇంత మందిని బ్యారేజీ పరిశీలనకు అనుమతించబోమని పోలీసులు బస్సులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పొన్నం, మహాదేవపూర్ సీఐకి మధ్య వాగ్వాదం జరిగింది.  చివరకు 10 మందిని పోలీసులు మేడిగడ్డ బ్యారేజీ దగ్గరకు తీసుకెళ్లారు. బ్యారేజీ చూసి వచ్చిన తరువాత పొన్నం ప్రభాకర్ మీడియాతో‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ, కాళేశ్వరాన్ని కడుతున్నప్పుడు హుస్నాబాద్ రైతులను బస్సుల్లో విహారయాత్రకు తీసుకొచ్చారని, ఈ నీళ్లతో గౌరవెల్లి నింపి హుస్నాబాద్ ను కోనసీమ చేస్తానని కేసీఆర్ ప్రగల్బాలు పలికారన్నారు. 

ఇప్పుడు ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోతే మాట్లాడడంలేదని, ప్రాజెక్టుకు ఏమయ్యిందో వివరించేందుకు ఒక్క ఆఫీసర్ కూడా లేడని అన్నారు. డిజైనింగ్ లోపం వల్లే పిల్లర్ కుంగిపోయిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి గురించి మాట్లాడే కేంద్ర ప్రభుత్వం పిల్లర్ కుంగడంపై ఎందుకు విచారణ చేపట్టడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మౌనం వీడి కాళేశ్వరం వాస్తవాలను బయటపెట్టాలన్నారు.