కాళేశ్వరం ముంపు భూములపై సర్వే చేసినా సప్పుడు లేదు!

కాళేశ్వరం ముంపు భూములపై సర్వే చేసినా సప్పుడు లేదు!

పెద్దపల్లి, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు ఆ రైతుల జీవితాల్లో చీకట్లు నింపింది. బ్యాక్​వాటర్​తో పొలాలన్నీ నీట మునుగుతుండడంతో జీవనాధారం కోల్పోయారు. మూడేండ్లుగా రైతుల గోడును సర్కారు పట్టించుకోవడం లేదు. తమ భూములను సర్కారు తీసుకుని పరిహారం చెల్లించాలని రైతులు కోరుతుండడంతో గత ఏడాది ఆఫీసర్లు సర్వే చేశారు. కానీ నేటికీ ఏ విషయం తేల్చడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిర్మించారు. వీటి నిర్మాణంలో లోకల్ స్ట్రీమ్స్, క్యాచ్​మెంట్​ఏరియాల నుంచి వచ్చే వరద నీటి సామర్థ్యాన్ని అధికారులు గుర్తించకుండా గోదావరి వరద నీటినే పరిగణలోకి తీసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత వరద ఉద్ధృతి పెరిగినప్పుడల్లా బ్యాక్ వాటర్ సమస్య ఏర్పడి మంథని, రామగుండం, వెల్గటూరులోని వందలాది ఎకరాలు నీట మునుగుతున్నాయి. 

అన్ని విధాలా నష్టపోయిన రైతులు

గత మూడేండ్లలో సాలుకు రెండు పంటల చొప్పున ఆరు పంటలు వేసిన రైతుల చేతికి ఒక్క గింజ కూడా రాలేదు. అన్ని పంటలూ నీటి పాలయ్యాయి. మొదటి సంవత్సరం పంట నీట మునిగిన తర్వాత అధికారులు వచ్చి నష్టాన్ని లెక్కించి ఎకరానికి రూ. 19 వేలు ఇచ్చారు. తర్వాత నష్టపోయిన ఐదు పంటలకు రూపాయి కూడా ఇయ్యలేదు. మూడేండ్లుగా కాళేశ్వరం బ్యారేజీల కింద ఉన్న పంటలు దాదాపు 20 వేల ఎకరాలు ముంపునకు గురవుతున్నాయి. ప్రతి ఏటా పొలాలు మునుగుతుండడంతో అధికారులే పంట వేయవద్దని సూచించారు. క్రాప్ హాలిడే కింద పరిహారం ఇస్తామని చెప్పారని రైతులు అంటున్నారు. కానీ ఇప్పటివరకు ఇవ్వలేదని వాపోతున్నారు. ప్రాజెక్టు నిర్మాణం కాకముందు బోర్లు వేయించి.. ఏటా రెండు పంటలు పండించేవాళ్లమని, నీటి తాకిడికి బోర్లు, పైపులైన్లు కూడా మునిగిపోయాయని, అన్ని విధాలుగా నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

తేలని పరిహారం.. రైతుల ఆందోళన

కాళేశ్వరం ప్రాజెక్టు కింద నిర్మించిన బ్యారేజీల బ్యాక్​వాటర్ తో ముంపునకు గురవుతున్న దాదాపు 20 వేల ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకోవడానికి సర్వే చేసింది. ముంపు భూములకు రూ. 6 లక్షల నుంచి 7 లక్షల వరకే చెల్లించే అవకాశం ఉందని అధికారులు చెప్తుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవలి కాలంలో పలు సమావేశాల్లో సీఎం కేసీఆర్​ తెలంగాణలో భూములు ఎక్కడైనా ఎకరం రూ. కోటి పలుకుతున్నాయని చెప్పారని, ఆయన చెప్పినట్లుగానే అన్నారం బ్యాక్​ వాటర్​ ముంపు భూములకు కూడా ప్రస్తుత రేట్ల ప్రకారం పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. లేదంటే ఎకరానికి రూ. 20 లక్షలు ఇయ్యాలని డిమాండ్ ​చేస్తున్నారు. బ్యాక్ వాటర్​తో మునిగిపోయిన పంటలకు నష్టపరిహారంతో పాటు క్రాప్ హాలిడే కాంపెన్సేషన్​కూడా ఇవ్వాలని ముంపు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. మంథని మండలం ఖాన్​సాయిపేట, అమ్మగారిపల్లి గ్రామస్తులు రెండు రోజుల క్రితం ఆర్డీఓ ఆఫీస్​ను ముట్టడించి ధర్నా చేశారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీఓకు అందజేశారు.

భూములున్నా సాగు చేయలేకపోతున్నం

ప్రస్తుతం ఉన్న రేటు ప్రకారం మా భూములు తీసుకోవాలె. తెలంగాణలో ఎక్కడైనా భూములు కోట్లు పలుకుతున్నయని సీఎం చెప్తున్నరు. మా భూములు కూడా అదేవిధంగా తీసుకోవాలె. భూమి ఉండి కూడా సాగు చేయలేకపోతున్నం. రెండు విధాలా నష్టపోతున్నం. వెంటనే ముంపు భూములను ప్రభుత్వం తీసుకొని రైతులను ఆదుకోవాలి. అలాగే మూడేండ్లుగా మాకు జరిగిన నష్టానికి పరిహారం అందించాలి.
- కుంట శ్రీనివాస్, 
ఖాన్​సాయిపేట, పెద్దపల్లి జిల్లా