కాటన్ దొరే అయితే.. పిల్లర్లు ఎట్ల కుంగే?

కాటన్ దొరే అయితే.. పిల్లర్లు ఎట్ల కుంగే?

సర్​ ఆర్థర్​ కాటన్​  ధవళేశ్వరం నిర్మాణం1847లో చేపట్టి 1852లో పూర్తి చేశారు.  173 ఏండ్లు అయింది!  128 ఏండ్ల వరకు అది  చెక్కు చెదరలే! దాన్ని తిరిగి1980లో ఆధునీకరించారు. సారు కాళేశ్వరం కట్టిన 2 ఏండ్లకే పంప్​ హౌస్​లు ఎట్ల మునిగె!  3 ఏండ్లకే పిల్లర్లు ఎట్ల కుంగె!  సారు కాటన్​ దొర ఎట్లాయె? అని పత్రికా పాఠకులకు అనుమానం కలగడం సహజం! కాళేశ్వరం పిల్లర్లు కుంగితే దర్యాప్తు జరిగింది. 

ధవళేశ్వరం బ్యారేజీ ఎందుకు కట్టావని బ్రిటిష్​ సర్కారు కాటన్​ దొరపై దర్యాప్తు చేశారనేది ఎక్కడ వెదికినా కనిపించలేదు. ఒకవేళ దర్యాప్తు చేసి ఉన్నా, ధవళేశ్వరం నిర్మాణంపైనో, అవినీతిపైనో మాత్రం అయిఉండదు. అయినా ‘నాడు కాటన్​.. నేడు కేసీఆర్​’ అని చెప్పుకోవడం బాగుంటుందేమో కానీ, అది వాస్తవ దూరమని మునిగిన పంప్​హౌస్​లు, కుంగిన పిల్లర్లే చెబుతున్నాయి కదా! కాటన్​ దొర బ్రిటిష్​ ఉన్నతాధికారి. కేసీఆర్​ ఓ సీఎంగా పనిచేశారు. అలా పోల్చడానికి పోలికేమైనా ఉందా?

‘కాళేశ్వరం’ ఈపేరు తెలంగాణ రాజకీయాల్లో తొమ్మిదేండ్లుగా హాట్​ టాపిక్. దాని నిర్మాణం చేపట్టిన 2016 నుంచే ప్రచారం మొదలైంది. ప్రపంచంలోనే అదొక అద్భుతమని కేసీఆర్​ సర్కారు చేయని ప్రచారమంటూలేదు. సెలెక్టివ్​లీ చెప్పించుకుంది. కేంద్ర పాలకులచేతా చెప్పించుకుంది.  ప్రచారం చేసుకోవడంలో ఏ అవకాశాన్నీ వదులుకోలేదు. 

ప్రజలను, పాత్రికేయులను, పరాయి దేశస్తులను, బస్సుల్లో తరలించి, విందు భోజనాలు ఏర్పాటు చేసి మరీ చూపించింది. చివరకు డిస్కవరీ చానెల్​ చేత డాక్యుమెంటరీ చేయించి అంతర్జాతీయ స్థాయిలో ప్రసారం చేయించింది. గొప్ప అద్భుతాన్ని  సృష్టించిన పాలకుడిగా తనకు తాను ప్రొజెక్టు చేసుకోవడంలో కేసీఆర్​ చూపించిన ఆసక్తి అంతా ఇంతా కాదు. 

ఒక పాలకుడిగా తాను చేస్తున్న, చేసిన పనిని చెప్పుకోవడం తప్పు కాదు. కానీ, ఆ ప్రచారంలో ఉన్న నిజమెంత? దాని డిజైన్​ లోపాలేమిటి? మితిమీరిన వ్యయం వెనుక ఉన్న రహస్యమేమిటి? ఆ ప్రాజెక్టు ఏమేరకు ఉపయోగంలోకి వచ్చింది? దాని నిర్మాణ పటిష్టత ఎంత?  అనే ప్రశ్నలు రోజులు గడుస్తున్నకొద్దీ బయటపడుతూ వచ్చాయి.

 ప్రచారార్భాటం పటాపంచలవుతూ వచ్చింది. వరదలకు  పంపు హౌస్​ల గోడలు కూలిననాడే, డిస్కవరీ చానెల్​ వారు యూట్యూబ్​ నుంచి కాళేశ్వరం డాక్యుమెంటరీని డిలీట్​ చేసుకున్నారు.  తదుపరి మేడిగడ్డ పిల్లర్లు కుంగినయి, పర్రెలు పాసినయి. మేడిగడ్డ బ్యారేజీ నుంచి నీళ్లను ఖాళీ చేయాల్సివచ్చింది. అలాంటి ప్రాజెక్టును తెలంగాణకు గుదిబండ కాదనేవారు ఎవరున్నారు? కాటన్​ దొరతో పోల్చుకోవడం ఎలా సాధ్యం?

నీళ్లు ఎక్కడ కనిపించినా అవి కాళేశ్వరం నీళ్లే మరి!

సర్ ఆర్థర్​ కాటన్​ ధవళేశ్వరం నిర్మించి ఉభయ గోదావరి జిల్లాలను సంపన్న జిల్లాలుగా మార్చిన మాట నిజం. అక్కడి ప్రజలు ఇప్పటికీ కాటన్​ దొరను మర్చిపోవడం లేదు. కాళేశ్వరం ప్రారంభించిన 2019 నుంచి 2023 వరకు ఎక్కడ నీళ్లు కనిపించినా అవి కాళేశ్వరం నీళ్లేనని ఉచిత ప్రచారం మొదలుపెట్టిన తీరు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం. అది 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లందించే ప్రాజెక్టన్నారు. మరో 18 లక్షల ఎకరాల ఆయకట్టును స్థీరికరించనుందన్నారు.  మరొక అడుగు ముందుకేసి  కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తుందన్నారు.  తీరా చూస్తే  రూ.97 వేల కోట్ల ప్రజాధనం వెచ్చించిన కాళేశ్వరం ప్రాజెక్టు.. కేవలం 92వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించిందని తేలింది. రాజకీయ ప్రచారానికి ఉపయోగపడినంతగా అది ప్రజల ప్రయోజనాలకు  ఉపయోగపడలేకపోయిందనేది నిష్టుర సత్యం.

  ఇంజినీర్లు, అధికారుల వేళ్లన్నీ సారు వైపే!

గత 6 ఏండ్లుగా అటు కాగ్​ రిపోర్టులు, ఇటు ఇంజినీర్​ నిపుణులు చెపుతూ వస్తున్న నిజాలే..  పీసీ ఘోష్​ కమిషన్​ తేల్చిన విషయాలు కూడా అవే నని వార్తలు చెపుతున్నాయి. అయినా కాళేశ్వరం నిర్మాణం గురించి, గత 5 ఏండ్లుగా మీడియాలో పుంఖాను పుంఖాలుగా వచ్చిన కథనాలు చదివిన తెలంగాణ ప్రజలకు ఘోష్​ కమిషన్​ రిపోర్టు చదివి తెలుసుకోవాల్సినంత అవసరం కూడా లేదు.  కర్త,  కర్మ,  క్రియ అన్నీ కేసీఆరే అని  కాళేశ్వరం నిర్మాణంలో పనిచేసిన ఇంజినీర్లు, అధికారులు ఘోష్​ కమిషన్​ ముందు చెప్పారు. 

ఆ ఇంజినీర్లు, అధికారుల వేళ్లన్నీ అప్పటి సీఎం కేసీఆర్​ వైపే చూపాయి. మేం స్వతహాగా ఏ నిర్ణయాలూ తీసుకోలేదన్నారు. అంతా పైవాళ్లు చెప్పినట్లే చేశాం అని చెప్పుకొచ్చారు. కేసీఆర్​ మాత్రం తమ వాగ్మూలంలో  కమిషన్​ ముందు అందుకు భిన్నంగా చెప్పడం గమనార్హం. ‘నాదేమీ లేదు, అంతా ఇంజినీర్లే నిర్మించార’ని సింపుల్​గా చెప్పేశారు. 

కానీ, ఘోష్​ కమిషన్​ ఏం తేల్చిందో పక్కన పెడితే.. సీఎంగా కేసీఆర్​ దాని నిర్మాణంలో జోక్యం చేసుకోలేదని నమ్మేవారు తెలంగాణలో ఎవరైనా ఉండి ఉంటారా? కాళేశ్వరం డీపీఆర్ నిర్మాణానికి ముందే​ కేబినెట్​ ఆమోదం పొందిందా లేదా అనేది.. ఘోష్​ కమిషన్ ​సమ్మరీ రిపోర్టు మాత్రం కేబినెట్ ఆమోదం పొందకముందే, ప్రాజెక్టు పనులు ప్రారంభించినట్లు చెపుతోంది. ఇలాంటి పాలనా  ఉల్లంఘనలు చాలానే కనిపిస్తున్నాయి.​  

 చేతులకు మట్టి అంటని పాలకులు!

పనిపూర్తి కాకపోయినా పూర్తయినట్లు ఇంజినీర్లు, కాంట్రాక్టర్లకు ఎన్​ఓసీలు ఎలా ఇచ్చారు? వాళ్లంతట వాళ్లే ఇచ్చే అవకాశం మాత్రం తక్కువే! పైనుంచి ఆదేశాలు లేకుండా రూ.వందల కోట్ల బిల్లులకు అనుమతులను ఏ ఇంజినీరూ ఇవ్వలేడు! ఇదొక బహిరంగ రహస్యమే!  కాకపోతే, ఫైళ్లపై సంతకాలు పెట్టే ఇంజినీర్లు, అధికారులు మాత్రమే దోషులుగా తేలడం సహజం. కానీ మౌఖిక ఆదేశాలిచ్చే పాలకులు మాత్రం చేతికి మట్టి అంటకుండా బయటపడుతుంటారు!  మరి కాళేశ్వరం దర్యాప్తులో ఏం జరుగుతుందో చూడాలె!

మూడు బ్యారేజీలకే పరిమితమైతే,అవినీతి తేలేదెలా?

ఘోష్​ కమిషన్​ దర్యాప్తు కేవలం మూడు బ్యారేజీల నిర్మాణాలలోని లోపాలకే పరిమితమైంది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తు జరిపి ఉంటే బాగుండేదని ప్రజల అభిప్రాయంగా వినబడుతోంది. ప్రధాని  మోదీ నుంచి కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ వరకు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఆరోపించినవారే! దర్యాప్తులు రాజకీయ ప్రయోజనాలకే పరిమితం కావొద్దని ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులెదుర్కొంటుందో అందరికీ తెలిసిందే. పదేండ్ల పాలనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై అనేక దర్యాప్తులు జరుగుతున్నాయి. అవినీతి సొమ్ముని రికవరీ చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బాగుపర్చాలని ప్రజాభిప్రాయాన్ని ప్రస్తుత ప్రభుత్వం విస్మరించకూడదు! 

పొగడ్తలతో తప్పును ఒప్పు చేయలేం!

కేసీఆర్​ నిజంగా కాటన్​దొరే అయితే, కాళేశ్వరం పిల్లర్లు కుంగేవి కావు, పంప్ హౌస్​లు మునిగేవి కావు.  నిజాయితీ కరువైన నేటి రాజకీయాల్లో నేతలు పుక్కిటిపొగడ్తలతో  తప్పును ఒప్పుగా మార్చుకోవచ్చని  భ్రమ పడుతుంటారు.  కాళేశ్వరం పిల్లర్ల కుంగుబాటును, పంప్​హౌస్​ల​ ముంపును పొగడ్తలతో అబద్ధంగా మార్చడం మాత్రం సాధ్యంకాదు కదా!

కాటన్​ దొరతో పోల్చి మళ్లీ ఇంజినీర్​ను చేస్తున్నారు!

సీఎంగా కేసీఆర్​ స్వయంగా అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ ఇచ్చారు. అనేక సందర్భాలలో తానే ఒక ఇంజినీర్​గా మారాననే పొడిపొడి పదాలు అనేకసార్లు చెప్పారు. ప్రాజెక్టు డీపీఆర్​ కేసీఆర్​ కనుసన్నలలోనే జరిగిందనేది ఘోష్​ రిపోర్టు సమ్మరీలో కనిపిస్తూనే ఉంది. తుమ్మిడిహట్టి వద్ద కావాల్సినంత నీళ్లు లేవని చెప్పి ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చడంలో నిజాయితీ లేదని, అలాగే ఎక్స్​పర్ట్ కమిటీ మేడిగడ్డ వద్ద వద్దని  ప్రత్యామ్నాయంగా వేమనపల్లి వద్ద నిర్మించాలని ఇచ్చిన రిపోర్టును  కూడా ముఖ్యమంత్రి, ఇరిగేషన్​ మంత్రి పట్టించుకోలేదని ఘోష్​ సమ్మరీ రిపోర్టు చెపుతోంది. 

నిర్మాణంలో నాణ్యత కొరవడడం, ప్రాజెక్టు ఆపరేషన్​ అండ్​ మెయింటెనెన్స్​లో పూర్తి వైఫల్యం చెందడం, బ్యారేజీలను పూర్తిగా నింపాలని సీఎం ఆదేశించడం. వరుస తప్పిదాలతో పిల్లర్లు కుంగడం, పంప్​హౌస్​లు మునగడం తెలిసిందే. కేసీఆర్​ జోక్యంవల్లే  తెలంగాణకు కాళేశ్వరం  ‘వైట్​ ఎలిఫెంట్​’గా, గుదిబండగా మారిందని అనేకమంది నిపుణుల అభిప్రాయం కూడా. ​ ఇంజినీర్​ కాని  కేసీఆర్​ను  ఇపుడు బ్రిటిష్​ ఇంజినీర్ కాటన్​ దొర​తో ఎందుకు పోల్చుతున్నట్లో తెలియదు! కమిషన్​ ముందు నాకేమీ తెలియదంటున్న కేసీఆర్​ను.. కాటన్​ దొరతో పోల్చి మళ్లా ఇంజినీర్​ను ఎందుకు చేస్తున్నారో అంతకన్నా అర్థంకాదు!

- కల్లూరి శ్రీనివాస్​రెడ్డి, పొలిటికల్​ ఎనలిస్ట్​ -