దేశంలోనే పెద్ద స్కామ్ కాళేశ్వరం : కేఏ పాల్

దేశంలోనే పెద్ద స్కామ్ కాళేశ్వరం : కేఏ పాల్
  •     సీబీఐ డైరెక్టర్​కు కేఏ పాల్ ఫిర్యాదు
  •     ప్రాజెక్టుపై హైకోర్టు సీజేకు 990 పేజీల రిపోర్ట్ ఇచ్చా
  •     సుప్రీం కోర్టు సీజేకు కంప్లైంట్ చేస్తానని కామెంట్

హైదరాబాద్, వెలుగు: దేశంలో అతి పెద్ద స్కామ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. ఈ ప్రాజెక్టులో రూ.50 వేల కోట్ల స్కామ్ జరిగిందని కాగ్ రిపోర్ట్ ఇచ్చిందన్నారు. ఈ స్కామ్ పై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ సోమవారం కోఠిలోని తెలంగాణ రీజియన్ సీబీఐ డైరెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. తర్వాత పాల్ మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం స్కామ్ పై ఈ నెల 10వ తేదీన 990 పేజీల రిపోర్ట్ ను హైకోర్టు చీఫ్ జస్టిస్ కు అందజేసినట్లు తెలిపారు. అయితే సీబీఐ విచారణకు హైకోర్టు ఇంత వరకు ఆదేశాలు ఇవ్వకపోవటం బాధకరమని అన్నారు. 

సీబీఐ విచారణ కోరుతూ రేవంత్ లేఖ రాయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు కోసం తెచ్చిన అప్పులు, వడ్డీలు కలిపి రూ.2లక్షల కోట్లకు చేరిందని.. ఈ ప్రాజెక్టుతో రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు. ఈ ప్రాజెక్టు కాంట్రాక్టర్ ‘మేఘా’ కృష్ణారెడ్డి దేశంలోని అన్ని పార్టీలకు సంబంధించి రూ.1200 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ కొన్నారని పాల్ గుర్తు చేశారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను కూడా త్వరలో కలుస్తానని చెప్పారు.