జల వివాదాలపై కోదండరామ్ దీక్ష

 జల వివాదాలపై కోదండరామ్ దీక్ష

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజజెక్టులో అవకతవకలపై విచారణ జరిపించాలని తెలంగాణ జన సమితి ( టీజేఎస్) అధ్యక్షుడు కోదండ రామ్ డిమాండ్ చేశారు. ‘జల విషాదాల అసమర్థ పాలకులపై రణ దీక్ష’ పేరుతో టీజేస్ పార్టీ కార్యాలయంలో  ఆయన దీక్షకు దిగారు. భారీ నష్టాలకు కారణమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని..వరద బాధితులకు న్యాయ సమ్మతమైన నష్టపరిహారం చెల్లించాలనే డిమాండుతో పార్టీ నాయకులతో కలసి దీక్ష చేపట్టారు. 
గత జులై నెలలో వచ్చిన వరదల కారణంగా పంట నష్టం భారీగా జరిగిందని, వరద బీభత్సంతో ప్రజలు సర్వం కోల్పాయారని ఈ సందర్భంగా కోదండరామ్ ఆందోళన వ్యక్తం చేశారు. వరద బాధితులకు ప్రభుత్వం న్యాయ సమ్మతమైన పరిహారం ఇవ్వాలని కోరారు. వరదలతో భద్రాచలం నీట మునిగితే తూతూ మంత్రంగానే సహాయక చర్యలు చేపట్టారని ఆరోపించారు. 
భారీ ఖర్చుతో నిర్మించిన కాళేశ్వరం పంపులు ఎందుకు మునిగాయని కోదండరామ్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ లోపం వల్ల ఎక్కువ నష్టం జరిగిందన్నారు. మేడిగడ్డ, మంచిర్యాలకు కేసీఆర్ ఎందుకు వెళ్లలేదని  ప్రశ్నించిన కోదండ రామ్  కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపించాల్సిందేనని పునరుద్ఘాటించారు.