కాళేశ్వరం ఖర్చు మళ్లీ పెంపు!

కాళేశ్వరం ఖర్చు మళ్లీ పెంపు!
  • 21వ ప్యాకేజీలో రూ. 1,241 కోట్లు
  • ప్రతిపాదనలు సిద్ధం చేసిన ఇంజనీర్లు.. 
  • త్వరలో ఆమోదించనున్న సర్కారు

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు మళ్లీ పెరగబోతోంది. ప్రాజెక్టులోని ప్యాకేజీ 21 నిర్మాణ వ్యయాన్ని రూ.1,241 కోట్లు పెంచేందుకు ఇంజనీర్లు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రిజర్వాయర్ కెపాసిటీ పెంపు, గ్రావిటీ కాల్వలకు బదులుగా పైపులైన్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సి రావడంతో ఖర్చు పెరిగినట్టు రివైజ్డ్ ఎస్టిమేట్స్లో ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం త్వరలో ఆమోదించనున్నట్టు తెలిసింది. ఎస్సారెస్పీ నుంచి తరలించే నీటితో నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లోని 2 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని ప్రతిపాదించారు. రీ ఇంజనీరింగ్లో భాగంగా ఇక్కడ కాల్వలకు బదులుగా పైపులైన్ల ద్వారా నీటిని తరలించాలని నిర్ణయించడంతో ఖర్చు భారీగా పెరిగింది. ఇప్పటికే ప్రాజెక్టు మొదటి మూడు లింకుల్లో నిర్మాణ వ్యయాన్ని భారీగా పెంచేందుకు ఓకే చెప్పిన సర్కారు ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలపడం లాంఛనమేనని తెలుస్తోంది.

మల్లన్నసాగర్ సింగూరు ద్వారా ఎస్సారెస్పీకి తరలించే నీటితో నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు నీరు అందించేందకు ప్రాజెక్టు లింక్ -7 లోని 5 ప్యాకేజీల్లో పనులు చేస్తున్నారు. ఇందులో లింక్ 21లో ప్రయోగాత్మకంగా పైపులైన్ సిస్టం ప్రవేశపెట్టారు. రూ.2,465.3 కోట్లతో ప్రతిపాదించిన ఈ పనులను మేఘా, హెచ్ఈఎస్ జాయింట్ వెంచర్ 2.1 శాతం లెస్కు దక్కించుకుని పనులు మొదలు పెట్టాయి. ఈ ప్యాకేజీలో కొండంచెరువు, మంచిప్ప ట్యాంక్ స్టోరేజీ కెపాసిటీని 3.50 టీఎంసీలకు పెంచడం, గ్రావిటీ కాల్వలకు బదులుగా పైపులైన్ సిస్టం ప్రవేశపెట్టడంతో నిర్మాణ వ్యయం రూ.3,707.25 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. గడ్కోల్ కాల్వల కింద 34 వేల ఎకరాలు, కొండంచెరువు నుంచి మెట్పల్లి కాల్వ కింద 46 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చే పైపులైన్లతో పనులు చేపట్టారు. ఈ పనులు పూర్తి చేసిన తర్వాత వర్క్ ఏజెన్సీనే 15 ఏళ్ల పాటు ఆపరేషన్స్, మెయింటనెన్స్ బాధ్యతలు చూడాల్సి ఉండటంతో నిర్వహణ భారాన్ని ఇందులో ప్రతిపాదించారు.

ప్యాకేజీ 27 పనులు రద్దు
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ప్యాకేజీ 27 పనులను ప్రభుత్వం రద్దు చేసింది. నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ ప్రాంతంలో 50 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు ప్యాకేజీ 27 (లక్ష్మీనర్సింహస్వామి లిఫ్ట్) రూ.332.64 కోట్లతో ప్రతిపాదించారు. భూ సేకరణ పూర్తి చేసినా వర్క్ ఏజెన్సీ అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయకపోవడంతో పనులను రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రతిపాదించారు. ఇక్కడ వర్క్ ఏజెన్సీ రూ.12.71 కోట్ల విలువైన పనులే పూర్తి చేసింది.

రెండు లింకుల్లో రూ. 8,254 కోట్లు పెంపు
కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన లింక్ 1 (మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి), లింక్ -2 (ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు) నిర్మాణ వ్యయం గతంలో రూ.8,254 కోట్లు పెంచారు. లింక్ -3 (మిడ్ మానేరు నుంచి అప్పర్ మానేరు) పనుల అంచనాలను రూ. 600 కోట్లకు పైగా పెంచారు. దీంతో ప్రాజెక్టు అంచనాలు రూ.9 వేల కోట్ల వరకు పెరగ్గా తాజా ప్రతిపాదనలతో రూ.10 వేల కోట్లకు పైగా పెరిగింది.