‘వృక్షో రక్షతి రక్షితః’ అనే సందేశంతో తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘కలివి వనం’. ఫోక్ సాంగ్స్‌తో పాపులరైన యూట్యూబర్ నాగదుర్గ ఇందులో లీడ్ రోల్ చేసింది. రఘుబాబు, సమ్మెట గాంధీ, విజయలక్ష్మి, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ, మహేంద్ర నాథ్, సతీష్ శ్రీ చరణ్, అశోక్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. రాజ్ నరేంద్ర దర్శకత్వంలో మల్లికార్జున్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి నిర్మించారు. శుక్రవారం సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ నాగదుర్గ మాట్లాడుతూ ‘ఇలాంటి మంచి సినిమాలో హరిత అనే క్యారెక్టర్‌కు నన్ను సెలెక్ట్ చేసిన దర్శక నిర్మాతలకు రుణపడి ఉంటాను. ఎలాంటి అంచనాలు లేకుండా సినిమాకు వచ్చినవారికి కచ్చితంగా నచ్చుతుంది’ అని చెప్పింది.
నటుడు రఘుబాబు మాట్లాడుతూ ‘ఎన్విరాన్మెంటల్ బేస్డ్‌గా తీసిన సినిమా ఇది. విజువల్స్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి’ అని అన్నారు. చిత్ర దర్శకుడు రాజ్ నరేంద్ర మాట్లాడుతూ ‘సినిమా అంటే వినోదమే కాదు, విజ్ఞానం అని కూడా తెలియపరుస్తూ విలేజ్ డ్రామాతోపాటు ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాం. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలనే ఆలోచన వస్తుంది’ అని అన్నారు. నటీనటులు, టెక్నీషియన్స్ అంతా పాల్గొన్నారు.
