సెట్టింగ్ కాదు.. కట్టిందే!

సెట్టింగ్ కాదు.. కట్టిందే!

రాజమౌళి సినిమాలో సెట్టింగ్​లా భారీగా ఉంది అనుకుంటున్నారా. ఇది సినిమా సెట్టింగ్​ కాదు, పర్మినెంట్​ కట్టడమే. నాంపల్లి గుట్ట మీద ఉన్న ఈ పాము నిర్మాణానికి చాలా ప్రత్యేకతలు, అంతకు మించి చరిత్ర ఉన్నాయి. 

ఎత్తైన కొండ, చుట్టూ పచ్చని చెట్ల మధ్య ఉంది నాంపల్లి గుట్ట. గుట్ట కింద నుంచి పై వరకు ‘కాళీయమర్దనం’ పేరుతో అతిపెద్ద పాము ఆకారంతో కట్టడాన్ని కట్టారు. దానిపై శ్రీకృష్ణుడు నాట్యం చేసే ప్రతిమ కూడా ఉంది. పాము ముందు ఉగ్రనరసింహుడు స్థంభాన్ని చీల్చుకొని వచ్చే విగ్రహం ఉంటుంది. పాము ఆకారం లోపలికి వెళ్లొచ్చు. అందులో భక్తప్రహ్లాదుడి చరిత్ర తెలిపే విగ్రహాలు ఉంటాయి. లక్ష్మీనరసింహస్వామి గుడి లోపలికి వెళ్లాలంటే 214 మెట్లు ఎక్కాలి. లేదా దాదాపు అరకిలో మీటర్ మేర ఘాట్​ రోడ్ కూడా ఉంది. ఈ గుట్ట రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఎనిమిది కిలోమీటర్లు, వేములవాడ రాజరాజేశ్వర టెంపుల్​కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. 

వందల ఏండ్ల చరిత్ర

నాంపల్లి గుట్టకు వందల ఏండ్ల చరిత్ర ఉంది. క్రీస్తుశకం11వ శతాబ్దంలో చాళక్య రాజైన రాజరాజనరేంద్రుడి భార్య రత్నాంగిదేవికి సంతానం కలగలేదు. దాంతో ఆమె బాధపడుతూ నాంపల్లి గుట్ట మీద సంతానం కోసం తపస్సు చేస్తుంది. అక్కడ ఉన్న నవనాథ సిద్దులు అనే వీరభక్తులు, తపస్సుకు బదులు అఖండ జ్యోతిని వెలిగించి, పూజ చేయమని ఆమెకి సలహా ఇస్తారు. దాంతో రత్నాంగిదేవి ఆ పూజ చేస్తుంది. ఆ టైంలో ఒక రాతి గుండు నుంచి ఒక శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం స్వామిదేనని నవనాథ సిద్దులు నమ్ముతారు. ఆ తర్వాత రత్నాంగిదేవికి కొడుకు పుడతాడు. అతడి పేరు సారంగధరుడు. అప్పటి నుంచి ఇక్కడి లక్ష్మీనరసింహస్వామిని ‘సంతాన లక్ష్మీనరసింహస్వామి’గా పిలుస్తారు.

సారంగధరుని శిరచ్ఛేదనం

నాంపల్లి గుట్టకి మరో చరిత్ర కూడా ఉంది. రాజరాజ నరేంద్రుని రెండో భార్య చిత్రాంగి. ఈమె సారంగధరుని మీద వ్యామోహం పెంచుకుంటుంది. కానీ, సారంగధరుడు చిత్రాంగి కోరికను కాదనడంతో రాజరాజనరేంద్రునికి అతని గురించి చెడుగా చెప్తుంది. అది విన్న రాజరాజనరేంద్రుడు కోపంతో సారంగధరుడ్ని నాంపల్లి గుట్టమీద శిరచ్ఛేదనం చేయిస్తాడు. కొలనులో పడి ఉన్న శవాన్ని నవనాథ సిద్దులు గుర్తుపట్టి, అతడ్ని బతికిస్తారు. ఈ విషయమంతా సారంగధరుని తల్లి రత్నాంగిదేవికి తెలిసి, నాంపల్లి గుట్ట పల్లెగా మారాలని శపిస్తుంది. అప్పటి వరకు నగరంలా ఉన్న నాంపల్లి ప్రాంతం పల్లెగా మారిందని చెప్తుంటారు. 

సొరంగ మార్గం

నాంపల్లి గుట్ట కింద సొరంగమార్గం ఉంది. గుట్ట దగ్గర్లో ఉన్న కొడిముంజ గ్రామంలోని రామప్ప ఆలయానికి, మరికొంత దూరంలో ఉన్న వేములవాడ గుడి​కి ఆ సొరంగమార్గం కనిపిస్తుంది. అప్పట్లో రాజులు, నవనాథసిద్దులు ఇక్కడి నుంచే వెళ్లేవారట! ఆ మార్గంలో నవనాథ సిద్దులు కొలిచిన రాతిగుండు ఇప్పటికీ అక్కడ ఉందంటారు. 
- మేడి కిషన్ , రాజన్న సిరిసిల్ల, వెలుగు