నీట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్ .. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన కాళోజీ హెల్త్ వర్సిటీ

నీట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్ .. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన కాళోజీ హెల్త్ వర్సిటీ
  • నేటి నుంచి 25వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ కు చాన్స్ 
  • విద్యార్థులు వివరాలు నమోదు చేసుకోవాలని సూచన
  • క్యాస్ట్, స్థానికత సర్టిఫికెట్లు తప్పనిసరిగా అప్​లోడ్​చేయాలి 
  • వెరిఫికేషన్ తర్వాత మెరిట్ లిస్ట్, వెబ్‌‌ ఆప్షన్ల ప్రక్రియ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 2025-–26 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌‌లైన్ దరఖాస్తుల నమోదు తేదీలను అందులో ప్రకటించింది. యూనివర్సిటీ పరిధిలోని ఎంబీబీఎస్, డెంటల్ మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. నీట్ యూజీ 2025 క్వాలిఫై అయిన అభ్యర్థులు జులై 16(బుధవారం)న ఉదయం 8 గంటల నుంచి జులై 25 సాయంత్రం 6 గంటల వరకు https://tsmedadm.tsche.in వెబ్‌‌సైట్ ద్వారా ఆన్‌‌లైన్‌‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొంది.

 రిజిస్ట్రేషన్ సమయంలో ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 4 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.3,200 ఫీజు, బ్యాంకు చార్జీలు చెల్లించాలని తెలిపింది. క్యాస్ట్, స్థానికతకు సంబంధించిన సర్టిఫికెట్లు తప్పనిసరిగా అప్​లోడ్​ చేయాలని పేర్కొంది. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం రాష్ట్ర విద్యార్థుల జాబితాతో మెరిట్ లిస్ట్ విడుదల చేసి, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభివచనున్నారు. హెల్ప్​లైన్ నంబర్లను కూడా ప్రకటించింది. మరిన్ని వివరాలు, అప్‌‌డేట్స్ కోసం http://www.knruhs.telangana.gov.in వెబ్‌‌సైట్‌‌ను సందర్శించాలని సూచించింది.

సీట్ల కేటాయింపు ఇలా...

రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలతో పాటు డీమ్డ్ యూనివర్సిటీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కలిపి 64 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 34 రాష్ట్ర ప్రభుత్వ కాలేజీలు కాగా, 26 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 85 శాతం సీట్లను, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని సగం (50%) సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. ప్రభుత్వ కాలేజీల్లో 4,090 సీట్లు ఉండగా, వాటిలో 15 శాతం అంటే 613 సీట్లు ఆలిండియా కోటా కిందికి వెళ్తాయి, మిగతా 3,477 సీట్లు పూర్తిగా తెలంగాణ విద్యార్థులకే దక్కుతాయి. అలాగే 26 ప్రైవేట్ కళాశాలల్లో 4,350 సీట్లలో 50 శాతం అంటే 2,175 సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు.