మెడికల్ పీజీ సీట్ల భర్తీపై రిజర్వేషన్లు ప్రకటించిన కాళోజీ వర్సిటీ

మెడికల్ పీజీ సీట్ల భర్తీపై రిజర్వేషన్లు ప్రకటించిన కాళోజీ వర్సిటీ
  • క్లినికల్‌లో 20%, నాన్ క్లినికల్‌లో 30% రిజర్వేషన్లు

హైదరాబాద్‌, వెలుగు:   మెడికల్ పీజీ సీట్ల భర్తీలో ఇన్‌సర్వీస్‌ కోటాను రాష్ట్ర సర్కార్ పునరుద్ధరించించినట్టు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని క్లినికల్ సీట్లలో 20 శాతం, నాన్ క్లినికల్ సీట్లలో 30 శాతం సీట్లను ఇన్‌సర్వీస్ కోటా కింద రిజర్వ్‌ చేస్తున్నట్టు శుక్రవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇన్‌సర్వీస్‌ కోటా అమలుపై ఈ నెల18న జీవో రిలీజ్ అయినట్టు నోటిఫికేషన్‌లో పేర్కొనగా, జీవో కాపీని రాష్ట్ర సర్కార్ ఇప్పటివరకూ బయటపెట్టలేదు. జీవోల వెబ్‌సైట్‌లో కూడా అప్‌లోడ్ చేయలేదు. మరోవైపు, ప్రభుత్వ నిర్ణయాన్ని సర్వీస్‌, నాన్‌ సర్వీస్‌ కేటగిరీ డాక్టర్లు వ్యతిరేకిస్తున్నారు. గతంలో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లోని క్లినికల్‌ కేటగిరీ సీట్లలో 30 శాతం, నాన్‌ క్లినికల్‌ కేటగిరీలో 50 శాతం సీట్లను ఇన్‌సర్వీస్ కోటా కింద భర్తీ చేసేవారు. కానీ, ఇప్పుడు ప్రభుత్వ కాలేజీలకే  కోటాను పరిమితం చేశారు. కోటాను సైతం తగ్గించారు. ఈ రెండు నిర్ణయాలను సర్వీస్‌లో ఉన్న డాక్టర్లు తప్పుబడుతున్నారు. ఇలా అరకొర కోటాతో తమకు పీజీ సీట్లు రావడం కష్టమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఇన్‌సర్వీస్ కోటాను అమల్లోకి తేవడాన్ని ప్రైవేటు డాక్టర్లు కూడా వ్యతిరేకిస్తున్నారు. 

నేటి నుంచి అప్లికేషన్లు 
మెడికల్ పీజీ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ వర్సిటీ శుక్రవారం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నీట్ పీజీలో క్వాలిఫై అయిన స్టూడెంట్లు శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని పేర్కొంది. ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటలకు అప్లికేషన్ గడువు ముగుస్తుందని తెలిపింది. సర్వీస్‌లో ఉన్నవాళ్లు సర్వీస్ సర్టిఫికెట్లు కంపల్సరీగా అప్‌లోడ్ చేయాలని సూచించింది. నోటిఫికేషన్‌, అప్లికేషన్ కోసం  http://knruhs.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి లాగి అవ్వాలని సూచించింది.