
హైదరాబాద్, వెలుగు: పదేండ్లు తెలంగాణను దోచుకున్న కల్వకుంట్ల కుటుంబమే పెద్ద చెడ్డీ గ్యాంగ్ అని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. చెడ్డీ గ్యాంగ్ అర్ధరాత్రి చోరీలు చేస్తే.. చంద్రశేఖర్ రావు గ్యాంగ్ మాత్రం పట్టపగలు తెలంగాణను దోచుకున్నదని ఫైర్ అయ్యారు. ఈ చెడ్డీ గ్యాంగ్‌కు కేసీఆర్ లీడర్ అని.. కేటీఆర్, కవిత, హరీశ్ రావు సభ్యులు అని ఎద్దేవా చేశారు. బుధవారం గాంధీభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.
‘‘మా సీఎం రేవంత్ రెడ్డిని ఇష్టమొచ్చినట్టు తిడ్తున్నవ్. నోటికి ఏమోస్తే అది అంటున్నవ్. ఇంకోసారి పిచ్చిపిచ్చి కామెంట్లు చేస్తే నీ తాట తీస్తా జాగ్రత్త. రేవంత్ రెడ్డిని చెడ్డీ గ్యాంగ్ మెంబర్ అంటావా? మా సీఎంను విమర్శించడానికి నువ్వెవరు? నీకు కొంచెమైనా సిగ్గుండాలి. నువ్వు కాళేశ్వరం కమీషన్ రావువి. అందినకాడికి కమీషన్లు నొక్కేసినవ్. ఆ డబ్బు మదంతో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నవ్. కాళేశ్వరంలో నీ బాగోతం కూడా బయటపడ్తది. మెక్కిన కమీషన్ అంతా కక్కిస్తం’’అని హరీశ్ రావును ఉద్దేశిస్తూ రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు రంగనాయక సాగర్ దగ్గర భూ సేకరణ పేరుతో రైతులను హరీశ్ రావు బెదిరించాడని ఆరోపించారు.
ఫామ్ హౌస్ వ్యవహారాలన్నీ బయటికి తీస్తం
‘‘రైతులను వేధించి.. బెదిరించి.. 13 ఎకరాల్లో ఫామ్‌హౌస్ కట్టుకున్నవ్. నువ్వు.. నీ బామ్మర్ది ఫామ్ హౌస్ వ్యవహారాలన్నీ బయటికి తీస్తం. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్టు బాగానే నటిస్తున్నవ్. బలవంతంగా భూములు గుంజుకున్నప్పుడు రైతులు గుర్తుకు రాలేదా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వంద రోజులైనా రుణమాఫీ చేయలేదని అంటున్నవ్. 2018లో రుణమాఫీ హామీ ఇచ్చి.. 2023 వరకు అమలు చేయనప్పుడు నీ మామను ఎందుకు నిలదీయలేదు?’’అని హరీశ్‌పై ఫైర్ రామ్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు.
బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని హరీశ్ పగటి కలలు కంటున్నాడని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ ఉండదని, ఒకవేళ ఆ పార్టీ ఉన్నా.. అందులో హరీశ్ రావు ఉండడని అన్నారు. కాగా, ‘‘హరీశ్ రావు ఎంత గింజుకున్న లోక్‌సభలో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ గెల్వదు. కనీసం మెదక్ ఎంపీ సీటు కూడా గెల్వది. మెదక్‌లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత హరీశ్ రావుకు ఆ పార్టీలో కౌంట్ డౌన్ మొదలవుతది. రేవంత్‌పై విమర్శలు చేయడమే పనిగా హరీశ్ రావు తిరుగుతున్నడు’’అని అన్నారు.