యాదగిరిగుట్ట, వెలుగు: పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం ఆండాళ్ అమ్మవారికి ‘ఊంజల్ సేవ’ను అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో నిత్య పూజలు ముగిసిన అనంతరం.. సాయంత్రం అద్దాల మండపంలో అమ్మవారికి ఊంజల్ సేవను చేపట్టారు. రకరకాల పూలు, వజ్ర వైఢూర్యాలు, బంగారు ఆభరణాలతో ఆండాళ్ అమ్మవారిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి అద్దాల మండపంలో ఉన్న స్వర్ణ ఊయలలో అధిష్టింపజేశారు.
అనంతరం ప్రత్యేక పూజలతో ఊంజల్ సేవను నిర్వహించి శయనింపజేశారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, పారాయణీకుల వేదపారాయణాల నడుమ అమ్మవారికి ఊంజల్ సేవ వైభవంగా నిర్వహించారు. అంతకుముందు అమ్మవారిని ఆలయ మాడవీధుల్లో విహరింపజేసి భక్తులకు దర్శనం కల్పించారు.
ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. మరోవైపు ఆలయంలో నిత్య పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఉదయం సుప్రభాతంతో మొదలై రాత్రి పవళింపుసేవతో ముగిశాయి. ఇక భక్తులు జరిపించిన పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా శుక్రవారం ఆలయానికి రూ.16,41,672 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
