తిమ్మాపూర్, వెలుగు: అన్నివర్గాల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి ఎల్‌ఎండీలో చేప పిల్లలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా రూ.2.18కోట్లతో 2 .20 కోట్ల చేప పిల్లలను చెరువులు, కుంటలు జలాశయాల్లో విడుదల చేస్తున్నామన్నారు.
వీటిద్వారా సుమారు 2500 మంది మత్స్యకారులు ప్రత్యక్షంగా, 1300మంది పరోక్షంగా జీవనోపాధి పొందుతారని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో మత్స్యశాఖ కాంట్రాక్టర్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేసేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఇటీవల చనిపోయిన మత్స్యకారుడి కుటుంబానికి రూ.5లక్షల బీమా చెక్కును అందజేశారు. కార్యక్రమంలో జిల్లా మత్స్య కార్మిక సంఘం చైర్మన్ రవీందర్, ఆర్టీఏ మెంబర్ రాహుల్, మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ విజయభారతి పాల్గొన్నారు.
