
- ఆయన ట్రబుల్ షూటర్ కాదు.. ట్రబుల్ క్రియేటర్
- అందులో భాగంగానే నన్ను సస్పెండ్ చేయించారు:
- కేసీఆర్‌పై ఒత్తిడి తెచ్చి.. కనీసం నా వివరణ తీసుకోకుండానే నన్ను ఉరి తీశారు
- కాళేశ్వరం అక్రమాలు, ఫోన్ ట్యాపింగ్‌కు హరీశే కారణం
- కాళేశ్వరం అవినీతి సొమ్ముతో 27 మంది ఎమ్మెల్యేలకు ఎన్నికల ఫండ్ ఇచ్చిండు
- హరీశ్, సంతోష్ అవినీతి వల్లే కేసీఆర్‌పై సీబీఐ ఎంక్వైరీ
- రామన్నా, నాన్నా.. వాళ్లిద్దరితో జరభద్రం!..
- సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ సరెండర్ అయ్యారు
- పార్టీలో చాలా మందికి రహస్య ఎజెండాలు ఉన్నయ్
- కాంగ్రెస్, బీజేపీతో కుమ్మక్కై పార్టీకి ద్రోహం చేస్తున్నారని వెల్లడి
- బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ ఫ్యామిలీని విడగొట్టేందుకు హరీశ్ రావు, సంతోష్ రావు కుట్ర పన్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. అందులో మొదటి చర్యగా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయించారని చెప్పారు. కేసీఆర్‌పై ఒత్తిడి చేసి, పార్టీ నుంచి బయటకు పంపించారని తెలిపారు. కనీసం తన వివరణ కూడా తీసుకోలేదని, డైరెక్టుగా ఉరి తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. హరీశ్‌రావు ఆరడుగుల బుల్లెట్టంటూ బీఆర్ఎస్ పార్టీ ట్వీట్లు చేస్తున్నదని, ఆ ఆరడుగుల బుల్లెట్టే చివరకు కేసీఆర్, కేటీఆర్‌కు నష్టం చేస్తుందని ఆరోపించారు.
పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన అనంతరం కవిత బుధవారం జాగృతి ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు, సంతోష్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు. హరీశ్‌రావు.. నల్లికుట్లోడు, నక్కజిత్తులోడని, ఆయన విషయంలో జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్, కేటీఆర్‌కు సూచించారు. వాళ్లిద్దరూ మేకవన్నె పులులని మండిపడ్డారు. వాళ్లను పక్కన పెట్టుకుంటే పార్టీ ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించుకోవాలని కేసీఆర్‌కు సూచించారు. ఈ మొత్తం పరిణామాల్లో అమ్మతో మాట్లాడకపోతుండడం చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
తండ్రి దగ్గరే రాజకీయ ఓనమాలు..
తన తండ్రి కేసీఆర్ చిటికెన వేలు పట్టుకుని ఉద్యమంలో రాజకీయ ఓనమాలు నేర్చుకున్నానని కవిత చెప్పారు. ‘‘కేసీఆర్ స్ఫూర్తితోనే సామాజిక తెలంగాణ గురించి మాట్లాడాను. మన దేశంలో దళితులకు మూడెకరాలు ఇచ్చిన ఏకైక సీఎం కేసీఆర్. సామాజిక తెలంగాణ కావాలని చెప్పింది ఆయనే కదా.. మరి బీఆర్ఎస్పార్టీకి సామాజిక తెలంగాణ అవసరం లేదా.. భౌగోళిక తెలంగాణ ఒక్కటే సరిపోతుందా? బంగారు తెలంగాణ కావాలన్నది కేసీఆర్ఇచ్చిన నినాదం కదా.. బంగారు తెలంగాణ అంటే ఏంది.. హరీశ్‌రావు ఇంట్లో, సంతోష్ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా? ప్రతి ఒక్కరు బాగుంటేనే అది బంగారు తెలంగాణ అవుతుంది. దాని గురించే నేను మాట్లాడాను. కాబట్టే నాపై కత్తిగట్టారు” అని చెప్పారు.
రామన్నను గడ్డం పట్టుకుని అడుగుతున్న..
తన మీద తప్పుడు కథనాలు రాయిస్తే తెలంగాణ భవన్‌లోనే ప్రెస్‌మీట్‌పెట్టి తనపై కుట్రలు జరుగుతున్నాయని చెప్పానని కవిత గుర్తు చేశారు. ‘‘రామన్నను గడ్డం పట్టుకుని బతిమాలుతున్నా.. బుజ్జగించి అడుగుతున్నా.. నీ చెల్లిని.. మహిళా ఎమ్మెల్సీని అయిన నా మీద కుట్రలు జరుగుతున్నాయని చెబితే.. మీరు కనీసం నాకు ఫోన్చేయరా అన్నా.? అన్నాచెల్లి బంధుత్వాలు పక్కనపెడదాం. పార్టీ పరంగా ఒక ఎమ్మెల్సీ మీద కుట్రలు జరుగుతున్నాయంటే మీరు మాట్లాడారా? కేసీఆర్బిడ్డనైన నేను ప్రెస్‌మీట్ పెట్టి కుట్రలు జరుగుతున్నాయ ని చెబితేనే పట్టించుకోలేదు. అలాంటిది పార్టీలో ఓ సామాన్య మహిళా కార్యకర్తకు అన్యాయం జరిగితే రెస్పాన్స్వస్తుందా? కానీ, నిన్న నాకు నోటీసులు రాగానే ఐదుగురు మహిళా నేతలు భవన్‌లో ప్రెస్‌మీట్‌పెట్టి మాట్లాడారు. ఇలాంటి అంతర్గత ప్రజాస్వామ్యం రావాలనే నేను కోరుకున్నాను’’ అని చెప్పారు.
మా బంధం పోయేది కాదు..
కేసీఆర్, కేటీఆర్, తనది రక్త సంబంధమని.. పదవులు పోతేనే, పార్టీ నుంచి సస్పెండ్చేస్తేనో పోయే బంధం కాదని కవిత అన్నారు. కానీ పార్టీలో ఉండి డబ్బులు సంపాదించుకోవాలనుకునే వాళ్లకు తాము కలిసి ఉండొద్దన్న ఆలోచన ఉందని చెప్పారు. తమ కుటుంబం విచ్ఛిన్నం కావాలన్నదే వారి కుట్ర అని ఆరోపించారు. అందులో భాగంగానే మొదటి చర్యగా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయించారన్నారు. అది ఇక్కడితో ఆగదన్నారు. ‘‘నాన్న (కేసీఆర్).. మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి. నేనూ మీలాగే ముక్కుసూటిగా మాట్లాడుతా. కాబట్టే నన్ను బలిపశువును చేశారు. రేపటి నాడు ఇదే ప్రమాదం రామన్నకు, మీకూ పొంచి ఉంది. బీఆర్‌ఎస్‌పార్టీని హస్తగతం చేసుకోవాలనే కుట్రలో భాగంగానే నన్ను పార్టీ నుంచి బయటకు గెంటేశారు” అని ఆరోపించారు.
కాళేశ్వరం ఎగ్జిక్యూషన్ అంతా హరీశ్‌రావుదే..
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎంగా కేసీఆర్ కేవలం విధాన పర నిర్ణయమే తీసుకున్నారని, ప్రాజెక్ట్ఎగ్జిక్యూషన్అంతా ఇరిగేషన్ మంత్రిగా హరీశ్‌రావే చూసుకున్నా రని కవిత చెప్పారు. దీనిపై అసెంబ్లీలో రేవంత్ మాట్లాడరని, మొత్తం కేసీఆరే చేసినట్టు ఆరోపించారన్నారు. రేవంత్, హరీశ్ మధ్య ఇంటర్నల్ అండర్ స్టాండింగ్ఉంది” అని ఆరోపించారు. ‘‘రామన్నా.. ఈరోజు హరీ శ్, సంతోష్ మీ దగ్గర మంచిగా ఉన్నట్టు నటిస్తున్నారు. వాళ్లు మన మంచి కోరుకునేవాళ్లు కాదు. తెలంగాణ బాగు కోరుకునేవాళ్లు కాదు. వాళ్లను దూరం పెట్టి.. బీఆర్ఎస్ హార్డ్‌కోర్ కార్యకర్తలను దగ్గరకు తీసుకుంటేనే పార్టీ బాగుంటది. మీరు బాగుంటరు. హరీశ్, సంతోష్అవినీతి వల్లే నాన్న సీబీఐ ఎంక్వైరీ ఎదుర్కోవాల్సి వస్తున్నది” అని అన్నారు.
పార్టీలో మొదట హరీశ్ లేరు
బీఆర్ఎస్‌లో మొదట హరీశ్ రావు లేరని, తర్వాత చేరారని కవిత చెప్పారు. ‘‘టీడీపీ నుంచి కేసీఆర్బయటకు వస్తుంటే.. ‘మామయ్య మనకెందుకు? డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా ఎందుకు చెయ్యాలి? మనం పెట్టే పార్టీ ఏమైతదో.. ఉద్యమం ఏమైతదో’ అని హరీశ్ అన్నారు. కోటిన్నర తీసుకుని వ్యాపారం చేసుకునేందుకు హరీశ్‌రావు ఎక్కడికో వెళ్లారని అప్పట్లో ఓ పేపర్‌లోనూ వచ్చింది.
టీఆర్ఎస్పెట్టిన 10 నెలలకు పార్టీలోకి హరీశ్ వచ్చారు. నాన్నది పెద్ద మనసు కాబట్టి.. హరీశ్ ఎమ్మెల్యే కాకపోయినా మంత్రి పదవి ఇచ్చిండు. ఆ తర్వాత పార్టీకి చెడ్డపేరు రాగానే.. హరీశ్పోయి వైఎస్‌రాజశేఖర్ రెడ్డిని కలిసిండు. హరీశ్‌రావు ట్రబుల్షూటర్కాదు.. డబల్షూటర్.. ట్రబుల్స్ క్రియేట్చేస్తడు. ఆ తర్వాత వాటిని పరిష్కరించినట్టు నటిస్తడు.
అందుకు ఇటీవల జరిగిన ఒక సంఘటనే ఉదాహరణ. దాసోజ్శ్రవణ్ను బరిలో నిలపాలని పార్టీ నిర్ణయించింది. కానీ హరీశ్మాత్రం.. రెండో క్యాండిడేట్‌ను నిలబెట్టి, బీజేపీ నుంచి కూడా ఒక క్యాండిడేట్‌ను నిలబెట్టేందుకు ప్రయత్నించారు. ‘మామతో నేను మాట్లాడుతా’ అని బీజేపీ వాళ్లతో చెప్పిండు. ఒక బీజేపీ ఎమ్మెల్యే నాకు ఫోన్‌చేసి ఇదంతా చెప్పిండు. ఈ విషయం వెంటనే నాన్నకు చెప్పాను. హరీశ్‌రావు ట్రబుల్క్రియేట్చేసి తానే పరిష్కరించినట్టు నటిస్తడు” అని చెప్పారు.
2018లోనే ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నం
2018 ఎన్నికలప్పుడు 27 మంది ఎమ్మెల్యేలకు హరీశ్‌రావు పార్టీ ఇచ్చిన నిధులు కాకుండా అదనంగా నిధులు సమకూర్చారని కవిత ఆరోపించారు.“హరీశ్‌కు అన్ని పైసలు ఎక్కడి నుంచి వచ్చినయ్? కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి ద్వారా సంపాదించిన డబ్బులే అవి. ఎన్నికల రిజల్ట్అటూ ఇటూ అవుతుందేమో.. ఎమ్మెల్యేలను ముందే కొని పెట్టుకోవాలని హరీశ్‌రావు అనుకున్నరు. కట్టప్ప లాంటోణ్ని అని ఎప్పుడూ చెప్పే హరీశ్‌కు అసలు అట్లాంటి ఆలోచన ఎందుకొచ్చింది?
హరీశ్నుంచి డబ్బులు తీసుకున్న ఎమ్మెల్యేల పేర్లు కూడా నాకు తెలుసు. 2009 ఎన్నికల్లో కేటీఆర్‌ను సిరిసిల్లలో ఓడించేందుకు హరీశ్‌రావు మా బంధువుతోనే రూ.60 లక్షలు పంపించిండు. మొన్న గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడించేందుకూ ప్రయత్నించారు. కేసీఆర్‌ను ఓడగొట్టేందుకు హరీశ్‌రావు ఎంత డబ్బైనా ఇస్తానన్నారంటూ వంటేరు ప్రతాప్‌రెడ్డి వీడియో రిలీజ్ చేశారు. అంతేకాదు.. నా నిజామాబాద్సెగ్మెంట్లో ఎమ్మెల్యేలందరినీ మేనేజ్ చేశారు.
కేసీఆర్ కుటుంబాన్ని ఓడగొట్టాలి.. విచ్ఛిన్నం చేయాలన్నదే హరీశ్ ఆలోచన” అని ఆరోపించారు. ‘‘హరీశ్ లాంటి వ్యక్తిని పక్కనపెట్టుకుని.. నిజం మాట్లాడే నన్ను బయటకు పంపితే పార్టీ బాగుంటుందా? దీనిపై కేసీఆర్, కేటీఆర్ ఆలోచించాలి. వాళ్లకు హాని తలపెట్టాలని నేను ఏనాడూ అనుకోలేదు. నాకు నాన్నమీద ఎలాంటి కోపం లేదు. అన్నా.. నాన్న ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ప్రజా సమస్యలపై పోరాడండి. అంతకు మించి నాకు కావాల్సింది ఏమీ లేదు’’ అని అన్నారు.
మొండిదాన్ని కాబట్టే తట్టుకుని నిలబడ్డాను..
20 ఏండ్లు తాను పార్టీ కోసమే పనిచేశానని కవిత పేర్కొన్నారు. అలాంటిది తనను ఉన్నట్టుండి పార్టీ నుంచి వెళ్లిపొమ్మంటే బాధగా ఉందని ఆమె అన్నారు. ‘‘పార్టీలో నా కంట్రిబ్యూషన్ ఏం లేదా? హరీశ్, సంతోష్‌లదే కాంట్రిబ్యూషన్ ఉన్నదా? నాన్న.. వీళ్లను పక్కన పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి” అని సూచించారు.
‘‘కుటుంబంలో జరిగిన విషయాలను నేను ఎవరికీ చెప్పలేదు.. చెప్పబోను. నేను గట్టిదాన్ని, మొండిదాన్ని కాబట్టి తట్టుకుని నిలబడ్డాను. నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారనగానే బీఆర్ఎస్ కార్యకర్తలంతా నా ఫ్లెక్సీలు, దిష్టిబొమ్మలు తగులబెట్టారు. మరి కేసీఆర్‌కు కమిషన్నోటీసులు, సీబీఐ ఎంక్వైరీ అన్నప్పుడు ఈ ఉత్సాహం ఎటుపోయింది? రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలు ఎందుకు తగులబెట్టలేదు?” అని ప్రశ్నించారు. తాను ఏ పార్టీలో చేరబోనని స్పష్టం చేశారు. బీసీ బిడ్డలు, మేధా వులు, జాగృతి కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానన్నారు. తనను షర్మిలతో పోలుస్తున్నరా? కేసీఆర్‌తో పోలుస్తున్నరా? కాలమే తేలుస్తుందని పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ చేసింది వాళ్లే..
ఫోన్ ట్యాపింగ్‌లోనూ హరీశ్‌రావు, సంతోష్‌రావు, శ్రవణ్‌ల పాత్ర ఉందని మీడియా చిట్‌చాట్‌లో కవిత వెల్ల డించారు. కేటీఆర్ సిబ్బంది ఫోన్లనూ ట్యాప్ చేశారని చెప్పారు. తన లేఖను సంతోష్రావే లీక్ చేశారని తేల్చి చెప్పారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆమె రిజైన్ ఆమోదించింది.
రామన్నా.. జాగ్రత్త..
అసెంబ్లీలో హరీశ్‌రావు ఏదో పొడిచేసినట్టు ఆరడుగుల బుల్లెట్టంటూ బీఆర్ఎస్పార్టీ ట్వీట్లు పెడుతున్నదని, ఆ ఆరడుగుల బుల్లెట్టు చివరికి ఎవరిని గాయపరుస్తుందని కవిత ప్రశ్నించారు. ఇప్పుడు తనను గాయపరిచారని.. మున్ముందు కేసీఆర్, కేటీఆర్‌ను గాయపరుస్తారని హెచ్చరించారు. ‘‘రామన్నా.. హరీశ్‌తో జర జాగ్రత్తగా ఉండండి. ఓసారి హరీశ్, కొందరు ఎమ్మెల్యేలు హంపీకి పోయారు. పార్టీని వెన్నుపోటు పొడుద్దామని డిసైడ్అయ్యారు. అప్పుడే కేటీఆర్దగ్గరకు హరీశ్వచ్చిండు.
‘స్లీపర్సెల్లా మామయ్య దగ్గరే ఉంటానని చెప్పు’ అని కేటీఆర్చేతులు పట్టుకుని హరీశ్అడిగిండు. ఆ తర్వాత పర్యవసానాల వల్ల ఈటల రాజేందర్పార్టీ నుంచి వెళ్లిపోయారు. హరీశ్ వల్లే జగ్గారెడ్డి నుంచి మొదలుకుని చెరుకు ముత్యం రెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి, రఘునందన్‌రావు, మైనంపల్లి హన్మంతరావు, విజయరామారావు వంటి వాళ్లు పార్టీ నుంచి వెళ్లిపోయారు. దుబ్బాకలో బీఆర్ఎస్ఓడిపోవడానికి కారణం హరీశ్‌రావే. హుజూరాబాద్ఉప ఎన్నికలో ఈటల రాజేందర్‌ను హరీశ్‌రావే దగ్గరుండి గెలిపించారు. రేవంత్‌రెడ్డి, హరీశ్ రావుల బంధం అప్పటి నుంచే కొనసాగుతున్నది’’ అని తీవ్ర ఆరోపణలు చేశారు.
రేవంత్‌కు హరీశ్ సరెండర్
ఢిల్లీ నుంచి హైదరాబాదో లేదా హైదరాబాద్ నుంచి ఢిల్లీకో వెళ్లేటప్పుడు సీఎం రేవంత్, హరీశ్ రావు కలిసి ఒకే విమానంలో వెళ్లారని.. అప్పటి నుంచే తనపై కుట్రలు మొదలయ్యాయని కవిత ఆరోపించారు. ‘‘రేవంత్కాళ్లు పట్టుకుని హరీశ్ రావు సరెండర్ అయ్యాకనే నాపై కుట్రలు మొదలు పెట్టారు. మా కుటుంబాన్ని విడగొట్టేందుకు కుట్ర పన్నారు. ఇద్దరు కలిసి ప్రయాణం చేశారో లేదో రేవంత్, హరీశ్చెప్పాలి” అని డిమాండ్ చేశారు.
‘‘బీఆర్ఎస్హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల హాస్టళ్లకు హరీశ్‌రావు సంస్థ నుంచే పాలు సప్లై చేశారని కాంగ్రెస్‌ప్రభుత్వ పీఆర్వో ట్వీట్‌చేశారు. కానీ ఆ తర్వాత అది పోయింది. రంగనాయక సాగర్దగ్గర ప్రభుత్వ భూమిని హరీశ్‌రావు కబ్జా చేశారని రేవంత్ ఆరోపించారు. అది రెండు రోజులు హెడ్‌లైన్స్‌లో ఉంది. ఆ తర్వాత గాయబ్. అదే కేటీఆర్‌ను మాత్రం తరచూ విచారణలంటూ పిలుస్తరు. కేసీఆర్కుటుంబం నిఖార్సుగా ప్రశ్నిస్తున్నది కాబట్టే విచారణలకు పిలుస్తున్నారు” అని అన్నారు.
సంతోష్.. కూరలో ఉప్పు లాంటోడు
సంతోష్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని కవిత అన్నారు. ‘‘సంతోష్.. కూరలో ఉప్పు లాంటోడు. సంతోష్ ధన దాహం గురించి ఎంత చెప్పినా తక్కువే. కేసీఆర్ హరి తహారం ప్రోగ్రామ్ తీసుకొస్తే.. దానికి డూప్లికేట్‌గా సంతోష్ గ్రీన్ ఇండియా చాలెంజ్ తీసుకొచ్చిండు. దాని వెనుక పెద్ద కుట్రే చేసిండు. ఫారెస్టులను కొట్టే యాలని ప్లాన్వేసిండు. ఆయనకు ఇద్దరు ముగ్గురు బినామీలు ఉన్నరు. అందులో ఒకరు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.
మోకిలాలో మేఘా కృష్ణా రెడ్డితో కలిసి రూ.750 కోట్ల బ్లూఫిన్ అనే మెగా ప్రాజెక్ట్ చేస్తున్నడు. ఈ విషయం పల్లా రాజేశ్వర్ రెడ్డి స్వయంగా చెప్పిండు. అవి అవినీతి డబ్బులు కావా? ఇంకో ఎమ్మెల్సీ నవీన్‌రావు కూడా సంతోష్ వల్లే తనకు ఎమ్మెల్సీ పదవి వచ్చిందని బాహాటంగా నే చెప్తడు. హరీశ్‌రావు, సంతోష్‌రావు బీజేపీ, కాంగ్రెస్‌తో కుమ్మక్కై.. బీఆర్ఎస్‌ను జలగల్లా పీడిస్తున్నరు. నిజామాబాద్‌లో నా ఓటమి తోనే వారి కుట్రలు మొదలయ్యాయి. ఏసీబీ వాళ్లకు వీళ్ల అడ్రస్‌లు దొరుకుతలేవా’’ అని ప్రశ్నించారు.