డిండి భూసేకరణ, పునరావాసం స్పీడప్ చేయాలి : కలెక్టర్ బదావత్ సంతోష్

డిండి భూసేకరణ, పునరావాసం స్పీడప్ చేయాలి : కలెక్టర్  బదావత్  సంతోష్

కల్వకుర్తి, వెలుగు: డిండి ఎత్తిపోతల పథకం కింద చేపట్టిన ప్యాకేజీ-1, ప్యాకేజీ-2 రిజర్వాయర్లకు సంబంధించిన భూసేకరణ, పునరావాస కేంద్రాల ఏర్పాటు పనులను స్పీడప్​ చేయాలని కలెక్టర్  బదావత్  సంతోష్  ఆదేశించారు. బుధవారం పట్టణంలోని ఆర్డీవో ఆఫీస్​లో రెవెన్యూ, భూసేకరణ, ఇరిగేషన్  శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. 

ప్యాకేజీ-1, ప్యాకేజీ-2కు చెందిన వెల్దండ, చారకొండ మండలాల్లోని గ్రామాల్లో భూసేకరణ, పరిహారం చెల్లింపు, అవార్డు ప్రక్రియ, పునరావాస కేంద్రాల ఏర్పాటు అంశాలను రివ్యూ చేశారు. ప్యాకేజీ 1లో భాగంగా వంగూరు మండలం సర్వారెడ్డిపల్లి, గాజర, ఉప్పల్  పహాడ్, దిండి చింతలపల్లి, ఉల్పర, మిట్ట సద్దగోడు, ఉమ్మాపూర్ గ్రామాల్లో 995.39 ఎకరాల భూసేకరణ పూర్తయిందని, ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్  ఆఫీసర్లకు సూచించారు. 

ప్యాకేజీ 2లో చారకొండ, వెల్దండ మండలాల్లోని సేరి అప్పరెడ్డిపల్లి, కమలాపూర్, గోకారం, ఎర్రవల్లి గ్రామాల్లో 2,144.16 భూసేకరణ పూర్తయిందని, మిగిలిన 51 ఎకరాల భూసేకరణ పూర్తి చేయాలని ఆర్డీవోను ఆదేశించారు. పరిహారం చెల్లింపులు, పునరావాస కేంద్రాల్లో సౌలతుల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని సూచించారు. అనంతరం ముంపునకు గురవుతున్న ఎర్రవల్లి గ్రామస్తులకు ఇంటి స్థలాలు కేటాయించేందుకు మండలంలోని పంజుగుల గ్రామంలోని ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఆర్డీవో జనార్ధన్ రెడ్డి, స్పెషల్  డిప్యూటీ కలెక్టర్  అరుణ రెడ్డి, తహసీల్దార్లు కార్తీక్ కుమార్, ఉమ పాల్గొన్నారు.

 అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్స్‌‌‌‌  నిర్మాణం

వంగూరు: అధునాతన సౌకర్యాలతో, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్  స్కూల్  నిర్మిస్తుందని కలెక్టర్  బదావత్  సంతోష్  అన్నారు. బుధవారం తెలంగాణ పబ్లిక్  స్కూల్  అభివృద్ధి పనులపై అధికారులు, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ.. స్కూల్  నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, పనులు స్పీడప్​ చేయాలని సూచించారు. స్కూల్​ ఏర్పాటుతో పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన భోజనం, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్య అందుతుందని చెప్పారు. అభివృద్ధి కమిటీ సభ్యులు ఎలాంటి లాభాపేక్ష లేకుండా తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. 

పబ్లిక్  స్కూల్  నిర్మాణానికి నిధుల కొరత లేదని, పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అంతకుముందు వంగూరులో తెలంగాణ పబ్లిక్  స్కూల్  డిజైన్, కాంపౌండ్  వాల్  పనులను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం పోల్కంపల్లి గ్రామంలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ పబ్లిక్  స్కూల్  పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. డీఈవో రమేశ్ కుమార్, తహసీల్దార్  మనోహర్, ఎంపీడీవో బ్రహ్మచారి, ఎంఈవో మురళి మనోహర చారి, నోడల్  ఆఫీసర్  నర్సిరెడ్డి, ఏఈ కోటేశ్వరరావు, సర్పంచ్  పి యాదయ్య పాల్గొన్నారు.