తప్పు చేస్తేనే సారీ చెబుతా: కన్నడ భాష వివాదంలో తగ్గేదే లేదన్న కమల్ హాసన్

తప్పు చేస్తేనే సారీ చెబుతా: కన్నడ భాష వివాదంలో తగ్గేదే లేదన్న కమల్ హాసన్

చెన్నై: తమిళ్ నుంచే కన్నడ భాష పుట్టిందని ప్రముఖ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కమల్ వ్యాఖ్యల పట్ల కన్నడిగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నటుడు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని కన్నడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కమల్ హాసన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని కర్ణాటక ఫిల్మ్ చాంబర్ కూడా డిమాండ్ చేసింది.. లేదంటే ఆయన సినిమాల విడుదలపై బ్యాన్ విధిస్తామని అల్టీమేటం జారీ చేసింది. 

ఈ వివాదంపై కమల్ హాసన్ తాజాగా మరోసారి స్పందించారు. కన్నడ భాషపై తాను చేసిన వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణ చెప్పాలనే డిమాండ్లను ఆయన తోసిపుచ్చారు. నేను తప్పు చేస్తే క్షమాపణ చెబుతా.. కానీ నేను ఎలాంటి తప్పు చేయనప్పుడు క్షమాపణ చెప్పనని తెగేసి చెప్పారు. ఇది నా జీవన విధానమని.. దయచేసి దీనిలో జోక్యం చేసుకోవద్దని ప్రజలను కోరారు. భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశమని.. చట్టం, న్యాయంపై నాకు నమ్మకం ఉందన్నారు. 

కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం థగ్ లైఫ్. మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమా 2025, జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడటంతో సినిమా ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు మూవీ మేకర్స్. ఈ క్రమంలోనే ఇటీవల నిర్వహించిన ఒక మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో నటుడు కమల్ హాసన్ మాట్లాడుతూ.. తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందని అన్నారు. కమల్ చేసిన ఈ వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. 

►ALSO READ | Bhairavam Review: ‘భైరవం’ ఫుల్ రివ్యూ.. సినిమా కథేంటీ? ముగ్గురు హీరోలు కమ్బ్యాక్ ఇచ్చేనా?

కన్నడ అనుకూల సంఘాలు, సాంస్కృతిక సంస్థలు, అనేక రాజకీయ నాయకులు కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కర్ణాటక ఫిల్మ్ చాంబర్ కూడా కమల్ సారీ చెప్పాలని డిమాండ్ చేసింది. లేదంటే థగ్ లైఫ్ చిత్రాన్ని కర్నాటకలో బ్యాన్ చేస్తామని హెచ్చరించింది. అయినప్పటికీ కమల్ తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెప్పడంతో.. కెఎఫ్‌సిసి  కర్ణాటకలో థగ్ లైఫ్ విడుదలను నిషేధించినట్లు శుక్రవారం (మే 30) ప్రకటించింది. ఈ నేపథ్యంలో తమిళ మూవీ ఇండస్ట్రీ కమల్ హాసన్‎కు మద్దతుగా నిలిచింది.