రాష్ట్రపతిని ఎందుకు ఆహ్వానించడం లేదు.. మోడీని ప్రశ్నించిన కమల్ హాసన్

రాష్ట్రపతిని ఎందుకు ఆహ్వానించడం లేదు.. మోడీని ప్రశ్నించిన కమల్ హాసన్

ఢిల్లీలో నిర్మించిన కొత్త పార్లమెంట్ ను ప్రధాని మోడీ ఈ నెల 28న ప్రారంభించనున్నారు. పార్లమెంట్ నూతన భవనాన్ని రాష్ట్రపతి చేత ప్రారంభింపజేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు విపక్ష పార్టీలు ఆదివారం (మే 28న) వేడుకకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించాయి. కొత్త పార్లమెంట్ వివాదంపై ప్రముఖ హీరో, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ఎందుకు రాకూడదో దేశ ప్రజలకు ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

‘‘ నేను ప్రధానిని ఓ ప్రశ్న అడుగుతాను, దయచేసి సమాధానం చెప్పండి.. మన కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి భారత రాష్ట్రపతి ఎందుకు హాజరుకాకూడదు’’ అని అడిగారు. దేశాధినేతగా ఉన్న రాష్ట్రపతి ఈ చారిత్రాత్మ కార్యక్రమంలో పాల్గొనపోవడానికి నాకు కారణం కనిపించడం లేదని కమల్ హాసన్ అన్నారు. 

దేశాధినేత అయిన రాష్ట్రపతిని ఈ వేడుకకు దూరంగా ఉంచడానికి తనకైతే ఒక్క కారణం కూడా కనబడటం లేదని కమల్ అన్నారు. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ వేడుకను జరుపుకోవడానికి తాను కూడా సపోర్టు చేస్తానని, కానీ రాష్ట్రపతిని పిలవకపోవడాన్ని మాత్రం తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ప్రారంభోత్సవ ఆహ్వాన ప్రక్రియలో విపక్షాలను భాగస్వామ్యం చేయకపోవడాన్ని కూడా వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్రపతిని ప్రారంభోత్సవ వేడుకకు ఆహ్వానిస్తే బాగుంటుందని కమల్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.