
‘విక్రమ్’ సినిమా క్లైమాక్స్‌లో గన్స్ ఫైర్ చేస్తూ యాక్షన్ హీరోగా మరోసారి సత్తా చాటారు కమల్ హాసన్. ఈ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన జోష్‌లో ఆయన మరో యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటించబోతున్నారు. హెచ్.వినోద్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. కమల్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్‌తో కలిసి మహేంద్రన్ నిర్మిస్తున్నారు. ఖాకీ, వలిమై, తెగింపు లాంటి చిత్రాల్లో యాక్షన్ సీక్వెన్స్‌ను అద్భుతంగా డిజైన్ చేసిన వినోద్.. ఇప్పుడు కమల్ హాసన్‌తోనూ భారీ యాక్షన్ సీన్స్ చేయించబోతున్నాడు.
‘గట్స్ అండ్ గన్స్’.. ట్రైనింగ్ బిగిన్స్ అంటూ గురువారం ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో రకరకాల గన్స్‌ను షూట్ చేయడంలో ట్రైనింగ్ తీసుకుంటూ కనిపించారు కమల్ హాసన్. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్‌గా నటించబోతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు శంకర్ తెరకెక్కిస్తున్న ‘ఇండియన్ 2’లో నటిస్తున్న కమల్.. మణిరత్నం డైరెక్షన్‌లోనూ ఓ సినిమా చేయబోతున్నారు.