బైడెన్​ స్థానంలో కమలా హారిస్!

బైడెన్​ స్థానంలో కమలా హారిస్!
  • అమెరికా అధ్యక్ష రేసులోభారత సంతతి మహిళ
  • వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న బైడెన్​
  • పార్కిన్సన్స్ ​​వ్యాధికి చికిత్స తీసుకుంటున్నట్టు వార్తలు
  • ఆయన స్థానంలో ప్రెసిడెంట్​ రేసులోకి కమలా హారిస్​తోపాటు మరికొందరు

న్యూయార్క్: అమెరికాలో ప్రస్తుతం ఎలక్షన్​ ఫీవర్​ నడుస్తోంది. 2024 నవంబర్‌‌ 5న జరగబోయే అధ్యక్ష ఎన్నికల కోసం డెమొక్రాట్, రిపబ్లికన్​ పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. డెమొక్రాట్​ అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్, రిపబ్లికన్​ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ బరిలో నిలిచారు. అయితే, ఇటీవల జరిగిన చర్చల్లో ట్రంప్​ దూసుకుపోగా.. జోబైడెన్​ తడబడ్డారు.

ఆయన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నట్టు డెమోక్రటిక్​ ​పార్టీలో చర్చ నడుస్తోంది. బైడెన్ మానసిక పరిస్థితి బాగాలేదని, ఆయన ప్రెసిడెంట్​రేసు నుంచి తప్పుకోవాలని రిపబ్లికన్లు చురకలంటిస్తున్నారు. బైడెన్‌‌కు స్థానంలో మరో వ్యక్తికి అవకాశం ఇస్తే మంచిదని సొంత పార్టీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో చివరివరకు ఆయన స్థానాన్ని ఆ దేశ వైస్ ​ప్రెసిడెంట్, భారతీయ మూలాలున్న కమలా హారిస్ ​భర్తీ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఆమెతోపాటు మరో ఐదుగురి పేర్లుకూడా తెరపైకి వచ్చాయి. బైడెన్​ స్థానాన్ని హారిస్​తోపాటు మిషిగాన్ గవర్నర్ విట్మెర్, కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్, ఇల్లినాయీ గవర్నర్ జేబీ ప్రిట్జ్కర్, పెన్సిల్వేనియా గవర్నర్‌‌ జోష్ షాపిరో, మిన్నెసోటా కాంగ్రెస్ సభ్యుడు డీన్ ఫిలిప్స్ భర్తీ చేయగలరని డెమోక్రాట్లు అభిప్రాయపడుతున్నారు. ఇందులో ట్రంప్​ను ఎదుర్కొనే సత్తా కమలా హారిస్​కు ఎక్కువగా ఉందని అంటున్నారు. కాగా, భారతీయ సంతతి మహిళ కావడంతోపాటు నల్లజాతీయురాలైన కమల హారిస్‌‌ను డెమోక్రటిక్ అభ్యర్థిగా ప్రకటిస్తే.. ప్రెసిడెంట్ ఎలక్షన్స్‌‌లో బాగా కలిసొస్తుందని కొందరు రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

సర్వేలూ హారిస్​వైపే మొగ్గు

మాజీ అధ్యక్షుడు ట్రంప్​పై ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్​కంటే కమలా హారిస్​ అయితేనే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలు సర్వేలు కూడా చెబుతున్నాయి. ఈ నెల 2న విడుదలైన సీఎన్ఎన్​ పోల్​ ప్రకారం.. ట్రంప్​ కంటే కేవలం 2% మాత్రమే హారిస్​వెనుకంజలో ఉండగా.. బైడెన్​ 6%  వెనుకబడి ఉన్నారు.

ఈ పోల్​లో ట్రంప్​కు 47శాతం ఓట్లు రాగా.. హారిస్​కు 45%, బైడెన్​కు 41 శాతం పోలయ్యాయి. అలాగే, రాయిటర్స్​ ఇప్సోస్​ సర్వేలో హారిస్​ 42% ఓట్లతో ట్రంప్​తో సరిసమానంగా నిలిచారు. బైడెన్ తప్పుకొని ఇతర డెమోక్రాట్లు రేసులో నిలిస్తే ఓటరు అభిప్రాయాలు మారుతాయని ఒక పోల్‌‌స్టర్ చెప్పారు.

బైడెన్​కు పార్కిన్సన్స్​?

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలు వెల్లువెత్తుతున్న వేళ వైట్​హౌస్​కు ఓ పార్కిన్సన్స్​ ఎక్సపర్ట్​ రావడం కలకల రేపింది. ఈ ఏడాది బైడెన్‌‌ ఆ డాక్టర్‌‌ను కలిసినట్టు వైట్​హౌస్​లాగ్​ బుక్​ ద్వారా బయటపడింది. దీంతో అధ్యక్షుడు నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యకు చికిత్స తీసుకుంటున్నారనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

అందుకే ఆయన తడబాటుకు గురవుతున్నారని చర్చ నడుస్తోంది. కాగా, ఈ ఊహాగానాలను వైట్​హౌస్​ వర్గాలు ఖండించాయి. బైడెన్​కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, ఆయన ఎలాంటి చికిత్స పొందడం లేదని తెలిపాయి. జనరల్​ చెకప్​లో భాగంగానే డాక్టర్లు వైట్​హౌస్​కు వచ్చినట్టు పేర్కొన్నాయి.