కామారెడ్డి బీఆర్ఎస్​లో ఫ్లెక్సీ గొడవ

కామారెడ్డి బీఆర్ఎస్​లో ఫ్లెక్సీ గొడవ
  • ఎమ్మెల్యే ఫొటో లేకపోవడంతో పంచాయితీ

 కామారెడ్డి, కామారెడ్డి టౌన్: కామారెడ్డి బీఆర్ఎస్​లో వర్గపోరు మంత్రి కేటీఆర్​టూర్​సందర్భంగా రచ్చకెక్కింది. కేటీఆర్​కు స్వాగతం పలుకుతూ మున్సిపల్​ చైర్​పర్సన్​ నిట్టు జాహ్నవి తండ్రి నిట్టు వేణుగోపాల్​రావు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే గంప గోవర్ధన్​ ఫొటో లేకపోవడంతో ఆయన వర్గం నేతలు మండిపడ్డారు. కొంతకాలంగా ఎమ్మెల్యేకు, మున్సిపల్​ చైర్​పర్సన్​కు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. కేటీఆర్​ మీటింగ్​ లోనూ గోవర్ధన్, చైర్​పర్సన్​ఎడమోహం పెడమోహంగానే ఉన్నారు. ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు జాహ్నవి పేరు కూడా ప్రస్తావించలేదు.   కేటీఆర్​ను గెలిపించడానికి లీడర్లు పాలిపగలు పక్కన బెట్టాలని మంత్రి కేటీఆర్ సూచించారు. భేషజాలు, పంచాయితీలను వదిలేసి అత్యధిక మెజార్టీ సాధించేందుకు కలిసికట్టుగా పని చేయాలన్నారు.  

కుల సంఘాల భేటీ కాన్సిల్..​ 

మీటింగ్​తర్వాత కేటీఆర్​ వివిధ కుల సంఘాలు, డాక్టర్లు, అడ్వకేట్లతో భేటీ అవుతారని చెప్పారు. పలుచోట్ల  మీటింగ్​ ఏర్పాట్లు కూడా చేశారు. అయితే కార్యకర్తల సమావేశం కాగానే కేటీఆర్ ఆరోగ్యం బాలేదంటూ ఎవరిని కలవకుండానే హెలికాప్టర్​లో హైదరాబాద్​కు తిరిగి వెళ్లిపోయారు. ఆయా సంఘాల మీటింగ్​లకు ఎమ్మెల్యే గోవర్ధన్​ హాజరయ్యారు. బీడి కార్మికులందరికీ జీవన భృతి కల్పించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్​ మీటింగ్​లో బీఎల్​టీయూ నేతలు ఫ్లకార్డులు ప్రదర్శించారు.  మహిళలను  పోలీసులు అక్కడి నుంచి పంపేశారు. దీంతో మరికొందరు   లీడర్లు అక్కడకి చేరుకుని ఫ్లకార్డులు ప్రదర్శించడంతో బీఆర్ఎస్​ లీడర్లు వారిపై దాడి చేశారు. నిరసన చేస్తున్న వాళ్లను  పోలీసులు అక్కడినుంచి తీసుకెళ్లారు.