
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలను వెంటనే రద్దు చేస్తున్నామని మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేస్తున్నట్లు గతంలోనే మున్సిపల్ శాఖ తెలిపిందని మంత్రి గుర్తు చేశారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బాధిత రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధుల బృందం శనివారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిశారు.
డీటీసీపీ ఆఫీసర్లతో మంత్రి మాట్లాడారు. ప్రస్తుతం అమల్లో ఉన్న పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే నడుచుకోవాలన్నారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రద్దుకు మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసిందన్నారు. రైతులు ఆందోనళలు చేపట్టినప్పుడు నమోదైన కేసులను కూడా ఎత్తేసే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేసు వివరాలను ఎస్పీతో మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం డీజీపీతో కూడా మాట్లాడారు. రైతు ప్రతినిధులతో పాటు ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత నిట్టు వేణుగోపాల్ రావు ఉన్నారు.