డ్యూటీలో చేరిన 22 రోజుల్లోనే..సెలవులో కామారెడ్డి మున్సిపల్ కమిషనర్

డ్యూటీలో చేరిన 22 రోజుల్లోనే..సెలవులో కామారెడ్డి మున్సిపల్ కమిషనర్
  •     ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు, దురుసు ప్రవర్తనతో మనస్తాపం?

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి మున్సిపల్​ కమిషనర్​పర్వతాలు డ్యూటీలో చేరిన 22 రోజుల్లోనే సెలవు పెట్టి వెళ్లారు. కొందరు మున్సిపల్​ ప్రజాప్రతినిధులు, లీడర్ల ఒత్తిళ్లు, దురుసు ప్రవర్తనతో మనస్తాపం చెంది సెలవుపెట్టి వెళ్లినట్లు తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి నాలుగు రోజుల క్రితం పట్టణ సమస్యలపై తన క్యాంప్​ఆఫీసులో మున్సిపల్​అధికారులతో రివ్యూ నిర్వహించారు. కాగా తమకు సమాచారం ఇవ్వకుండా మీటింగ్​కు ఎలా వెళ్లావంటూ కమిషనర్​ను మున్సిపల్ ​ప్రజాప్రతినిధి భర్త ప్రశ్నించినట్లు సమాచారం.

సోమవారం మున్సిపాలిటీలో కొందరు కౌన్సిలర్లు సమావేశమై తమకు తెలియకుండా మీటింగ్​కు ఎలా వెళ్తావని మళ్లీ ప్రశ్నించటంతో పాటు, పలు అంశాలపై కమిషనర్​పై ఆగ్రహ వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో మనస్తాపానికి గురైన కమిషనర్ ​వెంటనే అడిషనల్​కలెక్టర్(లోకల్ ​బాడీస్)​ వద్దకు వెళ్లి తాను ఇక్కడ పనిచేయనని చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత మున్సిపల్​ అధికారులకు సిమ్​కార్డు అందజేసి లీవ్​పై వెళ్లడం చర్చనీయాంశమైంది.