రూ.42.28 కోట్లతో.. కామారెడ్డి మున్సిపాలిటీ బడ్జెట్ ఆమోదం

రూ.42.28 కోట్లతో.. కామారెడ్డి మున్సిపాలిటీ బడ్జెట్ ఆమోదం
  • పన్నుల రూపంలో రూ.12.95 కోట్ల ఆదాయం
  • జనరల్​ బాడీ మీటింగ్​లో ఎజెండాపై సభ్యుల అభ్యంతరం

కామారెడ్డి, వెలుగు: 2024–25 ఏడాదికి సంబంధించి రూ.42.28 కోట్లతో కామారెడ్డి మున్సిపాలిటీ బడ్జెట్​ను ఆమోదించారు. మున్సిపల్​చైర్​పర్సన్​ నిట్టు జాహ్నవి అధ్యక్షతన స్థానిక కళాభారతిలో శుక్రవారం బడ్జెట్​ మీటింగ్​ నిర్వహించారు. కలెక్టర్​ జితేశ్​​వీ పాటిల్, అడిషనల్​ కలెక్టర్​ మనూచౌదరి, సభ్యులు, ఆఫీసర్లు హాజరయ్యారు. పన్నుల రూపంలో రూ. 12.95 కోట్లు, రెంట్లు, టౌన్​ప్లానింగ్, పబ్లిక్ ​హెల్త్ ​ద్వారా రూ.13.68 కోట్లు, వివిధ గ్రాంట్ల ద్వారా రూ.16 కోట్లు సమకూరుతాయని చైర్​పర్సన్​ జాహ్నవి పేర్కొన్నారు. మున్సిపల్​సిబ్బంది జీతాలకు రూ.2.96 కోట్లు, ఇంజనీరింగ్, ఇతర పనుల కోసం రూ.2.38 కోట్లు, నాన్ ​ప్లానింగ్​గ్రాంట్ల కింద రూ.15.42 కోట్ల ఖర్చులకు ఆమోదం లభించింది.

టౌన్​లో ​మౌలిక వసతులు కల్పించాలి: కలెక్టర్​

కామారెడ్డిలో మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేయాలని కలెక్టర్ ​జితేశ్ ​​వీ పాటిల్​ సూచించారు. బడ్జెట్​ మీటింగ్​లో ఆయన మాట్లాడుతూ..  ఆదాయ వనరులను సమకూర్చుకునేందుకు ప్రయార్టీ ఇవ్వాలన్నారు. కమర్షియల్ ఏరియాల్లో యూజర్​ ​చార్జీలు, పన్నుల వసూళ్లతో ఆదాయం పెంచుకొని వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. వేసవికాలంలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అడిషనల్​ కలెక్టర్​ మనూచౌదరి మాట్లాడుతూ..  జనాభా ప్రాతిపదికన శానిటేషన్, వాటర్​వర్క్స్​ సిబ్బందిని హేతుబద్ధీకరించాలన్నారు. కమిషనర్​ సుజాత, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ఎజెండాపై అంశాలపై ఎటూ తేల్చలే..

వేసవి దృష్ట్యా ఆయా వార్డుల్లో నీటి ఎద్దడి నివారణకోసం తయారు చేసిన యాక్షన్​ ప్లాన్, టెబుల్ ఎజెండా అంశాలపై బీజేపీ, కాంగ్రెస్ ​సభ్యులు అభ్యంతరం తెలిపారు. మీటింగ్​ వాయిదా వేయాలంటూ నోటీసు ఇచ్చారు. యాక్షన్​ ప్లాన్​లో కొన్ని వార్డులకే ప్రయార్టీ ఇచ్చారని, కౌన్సిలర్లందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ట్యాంకర్లను కొన్ని వార్డులకే ప్రతిపాదించడం సరికాదన్నారు.  కార్మికుల నెలల తరబడి జీతాలను పెండింగ్​లో పెట్టి, అభివృద్ధి పనుల బిల్లుల చెల్లించేందుకు ప్రతిపాదించడం ఏమిటని ప్రశ్నించారు. చైర్​పర్సన్, కమిషనర్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా సభ్యులు వినిపించుకొలేదు. సభ్యుల అభ్యంతరాలతో ఏజెండా అంశాలపై పూర్తి స్థాయిలో చర్చించకుండానే మీటింగ్​ను వాయిదా వేశారు.