పల్టీలు కొట్టిన బోగీలు : పశ్చిమ బెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం..

పల్టీలు కొట్టిన బోగీలు : పశ్చిమ బెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం..

పశ్చిమ బెంగాల్​ ఘోర రైలు ప్రమాదం జరిగింది. కాంచన్‌జంగా​ఎక్స్​ ప్రెస్, గూడ్స్​ రైలును ఢీకొట్టింది. 2024, జూన్​ 17వ తేదీ సోమవారం ఉదయం బెంగాల్ లోని న్యూజలపాయ్​ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది, పోలీసులు హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అగర్తల నుంచి వస్తున్న 13174 కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్.. న్యూజలపాయ్ గురి స్టేషన్‌కు సమీపంలోని రంగపాణి ప్రాంతంలో గూడ్స్ రైలును ఢీకొట్టినట్లు కతిహార్ డివిజన్ రైల్వే మేనేజర్ తెలిపారు. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారని.. మరో 30మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. రెండు ట్రైన్లు ఒకే ట్రాక్​ పై రావడంతో ప్రమాదం జరిగినట్లు చెప్పారు.ఈ ఘటనతో పలు రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపారు.

రైలు ప్రమాదంపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స కోసం వెంటనే స్పాట్ కు వెళ్లాలని వైద్య శాఖను ఆదేశించారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి బయలుదేరి వెళుతున్నారు సీఎం. మృతుల సంఖ్య, గాయపడిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో.. ముందు జాగ్రత్తగా అంబులెన్సులను సిద్ధం చేశారు. 

ఈ రైలు ప్రమాదంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా స్పందించారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఘటనాస్థలంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు యుద్ధప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రమాద బాధితుల కోసం టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేశారు రైల్వే అధికారులు.