కంగనాకు ‘వై కేటగిరీ సెక్యూరిటీ’.. కేంద్రం నిర్ణయం!

కంగనాకు ‘వై కేటగిరీ సెక్యూరిటీ’.. కేంద్రం నిర్ణయం!

న్యూఢిల్లీ: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కు మహారాష్ట్ర ప్రభుత్వం, శివ సేన నేతలతో కొన్ని వారాలుగా రగడ నడుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సేన ఎంపీ సంజయ్ రౌత్, కంగనా మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో కంగనాకు వై కేటగిరీ సెక్యూరిటీని కల్పించాలని కేంద్ర సర్కార్ నిర్ణయించినట్లు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ (ఎంహెచ్ఏ) వర్గాల సమాచారం. బుధవారం కంగనా ముంబైకి రానుంది. వై కేటగిరీలో వీఐపీకి భద్రతగా 11 మంది సెక్యూరిటీ గార్డ్స్ తోపాటు కమాండోలు ఉంటారు. ఈ విషయంపై కంగనా స్పందించారు. ‘ఎలాంటి ఫాసిస్టు ఫోర్సెస్ కూడా జాతీయవాద స్వరాలను అణచి వేయలేవని చెప్పడానికి ఇదే సాక్ష్యం. ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని నన్ను ముంబైకి వెళ్లాలని కోరినందుకు అమిత్ షాకు నేను రుణపడి ఉంటా. దేశపు కుమార్తె అనే మాటలను ఆయన గౌరవించారు. జై హింద్’ అని కంగనా ట్వీట్ చేశారు.

కంగనా రీసెంట్ గా ముంబైని పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) అని కామెంట్ చేసింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వంతోపాటు శివ సేన లీడర్లు ఆమెపై విమర్శలకు దిగారు. ముంబైని విడిచి సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లిపొమ్మని ఎంపీ సంజయ్ రౌత్ చేసిన కామెంట్స్ కు ప్రతిస్పందనగా ముంబైని పీవోకేగా కంగనా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. కంగనా తమ రాష్ట్ర ఆడబిడ్డ అని ఆమెకు సెక్యూరిటీ కల్పిస్తామని హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ చెప్పారు. తాజాగా కంగనాకు కేంద్రం వై కేటగిరీ సెక్యూరిటీ కల్పించనుందని తెలుస్తోంది.