కాణిపాకం బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం : సెప్టెంబర్ 3న రథోత్సవం

కాణిపాకం బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం : సెప్టెంబర్ 3న రథోత్సవం

సత్య ప్రమాణాలకు నెలవుగా.. అసత్యాలు చెబితే సింహ స్వప్నంగా  చిత్తూరు జిల్లా కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి క్షేత్రం బాసిల్లుతోంది. కోరిన కోర్కెలు తీర్చే ఆరాధ్యుడిగా పూజలందుకుంటున్నాడు స్వయంభు గణపతి... సిద్ధి....  బుద్ధిని దర్శిస్తే.. విఘ్నాలు హరించి.. సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఇంతటి మహత్యం కలిగిన వరసిద్ధి వినాయక దేవస్థానానికి వెయ్యేళ్ల చర్రిత ఉన్న కాణిపాకం వినాయకుడి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ దేవాలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. . .

కాణిపాకం వినాయకుడి  క్షేత్రంలో ప్రతి సంవత్సరం  జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. ఈనెల 28వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి.  పూర్వం విహారపురి అనే గ్రామంలో ధర్మాచరణ పరాయణులైన ముగ్గురు గుడ్డి, మూగ, చెవిటి వాళ్లుగా జన్మించారు. కర్మఫలాన్ని అనుభవిస్తూ.. వ్యవసాయే జీవనాధారంగా బతికేవారు. ఇక ఆ గ్రామాన్ని కరువు కాటకాలు చుట్టుముట్టాయి. 

గ్రామ జనానికి గుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రయత్నంలో ఆ ముగ్గురు సోదరులు తమ పొలంలో ఉన్న ఏతం బావిని మరింత లోతుగా తవ్వాలనుకున్నారు. బావిని తవ్వే క్రమంలో ఓ పెద్ద బండరాయి అడ్డుపడింది. దాన్ని తొలగించే యత్నంలో పార రాయికి తగిలి రాయి నుంచి రక్తం చిమ్మింది. ఆ రక్తంతో తడిసిన ఆ ముగ్గురు సోదరులకు అంగ వైకల్యం మటు మాయమైంది. 

ఈ విషయం ఆ నోట.. ఈనోట పడి.. ఊరంతా తెలిసింది. ఈ విచిత్రం తెలుసుకున్న జనం ఆ స్థలానికి వచ్చి బావిని పూర్తిగా తవ్వి పరిశీలించింది. బావిలోని గణనాథుని రూపం చూసి భక్తి శ్రద్ధలతో పూజిస్తూ.. కొబ్బరికాయలు కొట్టారు. అలా స్వామివారి విగ్రహం వద్ద కొట్టిన కొబ్బరికాయల నుంచి వచ్చిన తీర్థం కాణి భూమి (కాణి అంటే ఎకరం పొలం అని అర్థం)లోకి పారింది. అప్పటి నుంచి విహారపురి గ్రామం కాణిపారకమ్​అని.. అది కాస్త  కాలక్రమేణా కాణిపాకంగా మారింది. ఇలా స్వామి వారు స్వయంభుగా వెలసి.. కోరిన కోర్కెలు తీర్చే గణనాథుడిగా భక్తుల చేత పూజలందుకుంటున్నాడు.

సత్య ప్రమాణాలకు ఆరాధ్యుడిగా కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయం వెలుగొందుతోంది. తప్పు చేసే వ్యక్తులను స్వామి సన్నిధిలో ప్రమాణం చేయిస్తే.. ఆది దేవుడే శిక్షిస్తాడని భక్తుల విశ్వాసం. వ్యసనాలకు బానిసలైన వారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రమాణం చేయిస్తే.. వాటికి దూరంగా ఉంటారని భక్తుల నమ్మకం. సవాల్‌.. ప్రతి సవాళ్లలో కూడా సత్య ప్రమాణాలకు కాణిపాక వరసిద్ధి వినాయకస్వామిని ప్రతి ఒక్కరూ తలచుకుంటారు. దీంతో పాటు గణపతి హోమం, సంకటహర గణపతి వ్రతాలకు భక్తుల విశేషంగా కొలుస్తారు.

కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 28 నుంచి సెప్టెంబర్‌ 16వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ప్రతి రోజు స్వామి వారు వివిధ వాహన సేవల్లో దర్శనమివ్వనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా  అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యుత్‌ దీపాలంకరణతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. పెయింటింగ్‌ పనులను పూర్తి చేశారు. పుష్పాలంకరణ, అన్నదానం, ప్రసాదం, సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తుల వసతులు తదితర అంశాలపై ముందస్తు చర్యలు తీసుకున్నారు. ప్రతి రోజు అభిషేకం, స్వామి దర్శనం, ఊరేగింపు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరగనున్నాయి...