కాణిపాకం శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామివారి హుండీ ఆదాయం లెక్కించారు. . 26 రోజులకు సంబంధించి నిర్వహించిన హుండీ లెక్కింపులో 2 కోట్ల 33 లక్షల 34 వేల 358 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో పెంచల కిషోర్ వెల్లడించారు.
నగదుతో పాటు భక్తులు స్వామివారికి 41 గ్రాముల బంగారం, కిలో 105 గ్రాముల వెండిని భక్తులు సమర్పించారు.ఇక గో సంరక్షణ హుండీ ద్వారా 21 వేల 495 రూపాయలు, నిత్య అన్నదానం హుండీ ద్వారా లక్షా 59 వేల 461 రూపాయలు, భిక్షాండి హుండీ ద్వారా 23 వేల 215 రూపాయలు ఆదాయం సమకూరింది.
విదేశీ భక్తులు కూడా పెద్దఎత్తున కానుకలు సమర్పించారు. అమెరికా డాలర్లు 206, యూఏఈ దిర్హామ్స్ 155, ఆస్ట్రేలియా డాలర్లు 20, కెనడా డాలర్లు 25, ఇంగ్లండ్ పౌండ్లు 45, మలేషియా రింగిట్స్ 52తో పాటు 110 యూరోలు హుండీలో లభించాయి.ఆలయ చైర్మన్ మణి నాయుడు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, డిప్యూటీ ఈవో సాగర్ బాబు, ఏఈవోలు, ఆలయ అధికారులు, సిబ్బంది, సేవకుల సమక్షంలో హుండీ లెక్కింపు ప్రక్రియ నిర్వహించారు. 26 రోజుల్లోనే రూ.2.33 కోట్లకు పైగా హుండీ ఆదాయం రావడంతో కాణిపాకం వరసిద్ధి వినాయకుడిపై భక్తుల విశ్వాసం మరోసారి చాటిచెప్పింది.
