కన్నెపల్లి వద్ద రెండు మోటార్ల రన్

కన్నెపల్లి వద్ద రెండు మోటార్ల రన్

కాటారం ,వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధానమైన మేడిగడ్డ పంపు హౌస్ నుంచి అన్నారం బ్యారేజీకి నీరు పరవళ్లు తొక్కుతున్నాయి. రెండు మోటార్లను నిరంతరాయంగా నడిపిస్తుండడంతో గ్రావిటి కెనాల్‌లో 4600 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి నుంచి ఒకటో మోటార్‌ నడిపిస్తున్న ఇంజినీర్లు ఆదివారం మధ్యాహ్నం ఆరో మోటార్‌ రన్ చేస్తున్నారు. ఒకటో మోటార్ నుంచి 24 గంటలలో 0.2 టీఎంసీ, ఆరో మోటార్ ద్వారా 0.4 టీఎంసీల నీళ్లు అన్నారం బ్యారేజీకి చేరనున్నాయి. ఇప్పటికే అన్నారం వద్ద మూడు టీఎంసీ వాటర్ చేరాయని ఆఫీసర్లు తెలిపారు. మూడో నంబరు పంపును సోమవారం తెల్లవారుజామున రన్ చేయనున్నట్టు ఇంజినీర్లు తెలిపారు. గోదావరిలోకి ప్రాణహిత ప్రవాహం పెరగడంతో కన్నెపల్లి పంపు హౌస్ వద్ద 3 వ  మోటార్ కు ట్రయల్ రన్ చేస్తున్నట్టు తెలిపారు. దీంతో ఇప్పటికే 4600 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్న గ్రావిటీ కెనాల్‌లో మరో 23 వందల క్యూసెక్కుల ఫ్లో పెరగనుంది.

మేడిగడ్డ వద్ద 30 గేట్లు క్లోజ్

మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు ప్రాణహితకు వరద ప్రవాహం రోజురోజుకు పెరుగుతున్నది. ఆ నీటిని పంప్‌ చేసేందుకు మేడిగడ్డ బ్యారేజీ వద్ద గేట్లను మూసేస్తున్నారు. మొత్తం 85 గేట్లకు గాను ఆదివారం నాటికి 30 గేట్లను క్లోజ్ చేశారు. మేడిగడ్డ వద్ద ఫ్రీ ఫ్లో 20 వేల క్యూసెక్కులు ఉండాగా దానికి అనుగుణంగా మహారాష్ట్ర వైపు 24  గేట్లు మూసిన అధికారులు తెలంగాణా వైపు బ్లాక్ 1 లో ఆరు గేట్లను మూశారు. ప్రవాహం ఆధారంగా మిగతా గేట్లను మూసి నీటిని ఆపేందుకు ప్రయత్నిస్తామన్నారు.