వామ్మో.. ఈ గుండెపోటు చావులేంటో..? తాళి కట్టిన పావు గంటకే వరుడు మృతి

వామ్మో.. ఈ గుండెపోటు చావులేంటో..? తాళి కట్టిన పావు గంటకే వరుడు మృతి

వెన్నుపోటు వార్తల కంటే ఈ మధ్య గుండెపోటు ఘటనలే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాయి. తాళి కట్టిన 15 నిమిషాల్లోనే పెళ్లి కొడుకు జీవితం గుండెపోటుకు బలైపోయింది. మూడు ముళ్లు వేసిన పావు గంటలోనే గుండెపోటు ఆ వరుడి జీవితాన్ని మూణ్ణాళ్ల ముచ్చటగా మార్చింది. ఈ విషాద ఘటన కర్ణాటకలోని బాగల్‌కోటే పరిధిలో ఈ ఘటన జరిగింది. సంతోషంగా పెళ్లికి, పెళ్లి ఇంటికి వచ్చిన బంధువులు, స్నేహితులు వరుడి అంత్యక్రియలకు హాజరయ్యారు. పాపం.. ఆ రెండు కుటుంబాలకు ఇంతకు మించిన విషాదం ఉండదేమో.

బాగల్‌కోటే పరిధిలోని జమ్ఖండి పట్టణంలో జరిగిన ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. శనివారం ఈ ఘటన జరిగింది. వరుడు ప్రవీణ్ వధువు మెడలో మంగళసూత్రం కట్టిన కొన్ని నిమిషాల్లోనే కుప్పకూలిపోయాడు. అంబులెన్స్ లో వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి అతనిని తరలించారు. అయితే.. అప్పటికే ప్రవీణ్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ప్రవీణ్ వయసు జస్ట్ పాతికేళ్లు. యువకుల్లో ఇలా గుండెపోటు సమస్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

దేశంలో గుండె పోటుతో చనిపోతున్న వారి సంఖ్య ఈ మధ్య కాలంలో క్రమంగా పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా.. చిన్నవయసులోనే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఏదో ఒక పనిచేస్తూ ఒక్కసారిగా కార్డియాక్ అరెస్ట్తో కుప్పకూలుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. వ్యాయామం చేస్తూ ఒకరు, డ్యాన్స్ చేస్తూ మరొకరు, కూర్చున్న వారు కూర్చున్నట్టే క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. పట్టరాని ఆనందం వచ్చినా, భయాందోళలకు గురైనా గుండె కొట్టుకునే వేగం పెరగడం సాధారణం. కానీ గుండెపోటు వస్తే ఇక చావే గతి అనే పరిస్థితి రావడం మనిషి జీవన శైలినే ప్రశ్నార్థకంగా మార్చింది.

ALSO READ | హత్యాయత్నం కేసులో ప్రముఖ నటి నుస్రత్ ఫరియా అరెస్ట్