
ఇస్లామాబాద్: భారత్‌పై విషం చిమ్మే లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. లష్కరే తోయిబా టెర్రర్ గ్రూప్ టాప్ కమాండర్ సైఫుల్లా ఖలీద్ హతమయ్యాడు. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో గుర్తు తెలియని దుండగులు ఖలీద్‌ను కాల్చి చంపినట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి.
లష్కరే తోయిబా కమాండర్ సైఫుల్లాకు వినోద్ కుమార్, మొహమ్మద్ సలీం, ఖలీద్, వానియల్, వాజిద్, సలీం భాయ్ వంటి చాలా మారు పేర్లు ఉన్నాయి. ఎల్‌ఇటి ఉగ్రవాద కార్యకలాపాలలో ఖలీద్ కీలక వ్యక్తి. ఈ సంస్థ కోసం నియామకాలు, నిధుల సేకరణ, సరిహద్దు చొరబాట్లను నిర్వహించడంలో ఇతడు సిద్ధహస్తుడు.
భారత్ పై లష్కరే తోయిబా చేసిన చాలా ఉగ్రదాడుల వెనక ఖలీద్ హస్తం ఉంది. 2001లో ఉత్తర్ ప్రదేశ్‌లోని రాంపూర్ సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై దాడి, 2005 ఐఐఎస్సీ క్యాంపస్‌పై ఎటాక్, 2006లో నాగపూర్ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంపై దాడి వెనక సైఫుల్లా ఖలీద్ ప్రధాన నిందితుడు. సైఫుల్లా ఫేక్ ఐడెంటిటీతో నేపాల్ కేంద్రంగా ఎల్‌ఇటి మాడ్యూల్‌ను నిర్వహిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.
ఇండో-నేపాల్ సరిహద్దు ద్వారా ఉగ్రవాదులను భారతదేశంలోకి పంపి.. దాడులకు కుట్రలు చేస్తుంటాడు. లష్కరే తోయిబా, దాని రాజకీయ సంస్థ జమాత్-ఉద్-దవా (జెయుడి) ఈ రెండింటికీ రాడికలైజేషన్, నిధుల సేకరణలో ఖలీద్ది కీలక పాత్ర. అయితే.. చాలా కాలం పాటు నేపాల్‌లో ఉంటూ లష్కరే ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించిన ఖలీద్.. ఇటీవల పాకిస్థాన్‌కు మకాం మార్చాడు. పాకిస్థాన్ సింధ్ ప్రావిన్స్‌లోని బాదిన్ జిల్లా మట్లి తాలూకాలో ఉంటున్నాడు.
ఈ క్రమంలోనే ఆదివారం (మే 18) సైఫుల్లాను గుర్తు తెలియని దుండగులు దారుణంగా కాల్చి చంపారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మిషన్‌లో పాక్, పీవోకేలోని జైష్ ఈ మహ్మద్, లష్కరే తోయిబా వంటి ప్రధాన ఉగ్ర సంస్థల స్థావరాలను ధ్వంసం చేసింది. భారత దాడుల్లో పలు ఉగ్రవాద సంస్థలకు చెందిన దాదాపు 100 మంది టెర్రరిస్టులు హతమయ్యారు.
ఇందులో లష్కరే గ్రూప్ ఉగ్రవాదులు కూడా చాలా మంది ఉన్నట్లు సమాచారం. ఈ దెబ్బ నుంచి తెరుకోకముందే.. తాజాగా ఆ గ్రూప్ టాప్ కమాండ్ సైఫుల్లా ఖలీద్ హతం కావడంతో లష్కరే తోయిబాకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్, పాక్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న తరుణంలో భారత్లోఎన్నో ఉగ్రదాడులకు మాస్టర్ మైండ్ గా వ్యవహరించిన ఉగ్రవాది సైఫుల్లా హతం కావడం గమనార్హం.