ఐదు మోటార్లతో పంపింగ్

ఐదు మోటార్లతో పంపింగ్
  • కన్నెపల్లి నుంచి 9200 క్యూసెక్కులు ఎత్తిపోత
  • అన్నారం బ్యారేజీలో 3.53 టీఎంసీల నీరు
  • మేడిగడ్డ వద్ద 6.5 టీఎంసీల నీటి నిల్వ
  • కన్నెపల్లి పంప్‌ హౌస్ తాకిన మేడిగడ్డ బ్యాక్‌ వాటర్‌
  • మునిగిన 30 ఎకరాల చెలకలు

జయశంకర్‌‌ భూపాలపల్లి, కాటారం, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌లోని కన్నెపల్లి పంపు హౌస్ వద్ద ఆదివారం ఐదో పంపు ప్రారంభించారు. ఇప్పటికే 1,3,4,6 వ పంపుల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్తగా ఐదో పంపు ట్రయల్ రన్ చేసిన్రు. ఐదు పంపులతో రోజుకు 9,200 క్యూసెక్కులు అన్నారం బ్యారేజీలోకి చేరుతున్నయి. ఇప్పటి వరకు అన్నారం బ్యారేజీలో 3.53 టీఎంసీల నీరు చేరినయి. మేడిగడ్డ బ్యారేజీ వద్ద 6.5 టీఎంసీల నిల్వ ఉంది. మేడిగడ్డ బ్యాక్‌‌ వాటర్‌‌ కన్నెపల్లి పంప్‌‌హౌస్​ను తాకుతున్నయి. దీంతో కాఫర్‌‌డ్యాంతో సంబంధం లేకుంటనే మోటార్లతో పంపింగ్‌‌ చేసుకునే అవకాశం ఏర్పడింది. మేడిగడ్డ బ్యారేజీ బ్యాక్ వాటర్, స్ట్రెయిట్ వాటర్‌తో కలిపి మేడిగడ్డ పంపుహౌస్ ఫోర్ బే వద్ద పంపింగ్‌కు అవసరమైన 95 మీటర్ల వాటర్ లెవల్ మెయింటేన్‌ చేస్తూ మోటార్లు రన్ చేస్తున్నమని ఆఫీసర్లు చెప్పిన్రు.

మేడిగడ్డ వద్ద 6.5 టీఎంసీల నీటి నిల్వ

కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజీ వద్ద మొత్తం 85 గేట్లను ముసివేసారు. ఆదివారానికి బ్యారేజీ వద్ద వాటర్ లెవల్ 96 మీటర్లు చేరింది. బెడ్ లెవల్ నుంచి ఎనిమిది మీటర్ల ఎత్తున నీరుంది. బ్యారేజీలో మొత్తం 6.5 టీఎంసీల నిల్వ ఉంది. బ్యారేజీ వద్ద కట్టాల్సిన గైడ్ బండ్‌లు ఇంకా కాలేదు. దీంతో దగ్గరి ఊర్ల నుంచి వచ్చే వరద గోదావరిలో కలిసే ఒర్రెలు ఈ బ్యాక్ వాటర్‌తో ఎనుకకు కమ్మినయి. దీంతో 30 ఎకరాల చెలకలు మునిగాయి. ఈ భూముల్లో పత్తి విత్తనాలు నాటిన రైతులు నష్టపోయిన్రు.

అన్నారం వద్ద పెరిగిన వాటర్ లెవల్

ప్రాణహితలో కొనసాగతున్న12 వేల క్యూసెక్కుల ప్రవాహంతో మేడిగడ్డ పంపుహౌస్ వద్ద 2 నుంచి 5  మోటార్లను రన్ చేస్తున్నరు. దీంతో 13.5 కిలోమీటర్ల  గ్రావిటీ కెనాల్ గుండా ప్రయాణించి అన్నారం బ్యారేజీలో  చేరుతున్నయి. దీంతో ఆదివారం నాటికి బ్యారేజీ వద్ద బెడ్ లెవల్ నుంచి 8.7 మీటర్ల నీరు చేరినయ్‌. ఇప్పటిదాకా 3.53 టీఎంసీల వాటర్‌ చేరింది. బ్యాక్‌‌ వాటర్ 24 కిలోమీటర్లు పోయి పెద్దపల్లి జిల్లా వేలాల వరకు చేరినయని ఇంజినీర్లు చెప్పిన్రు. అక్కడ గోదావరి వెడల్పు ఎక్కువగా ఉండడం తో బ్యాక్ వాటర్ నెమ్మదిగా పెరుగుతుందన్నరు.