Tax News: కంగారులో కొత్త పన్ను విధానం ఎంచుకోకండి.. ఓల్డ్ రీజీమ్‌తో రూ.లక్ష+ సేవ్ చేస్కోండి!

Tax News: కంగారులో కొత్త పన్ను విధానం ఎంచుకోకండి.. ఓల్డ్ రీజీమ్‌తో రూ.లక్ష+ సేవ్ చేస్కోండి!

ITR Filing: మోదీ సర్కార్ పన్ను సంస్కరణల్లో భాగంగా కొత్త పన్ను విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. దీంతో ఓల్డ్ టాక్స్ రీజిమ్, న్యూ టాక్స్ రీజిమ్ అందుబాటులోకి వచ్చాయి. కొత్త విధానం కింద పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనాలను అందించలేదు. అయితే గత బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పన్ను విధానం కింద ఉద్యోగులకు రూ.12 లక్షల వరకు ఉన్న ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండబోదని ప్రకటించారు. ఈ క్రమంలో చాలా మందిలో ఏ పన్ను విధానం కింద ఐటీఆర్ ఫైల్ చేయాలనే అనుమానం ఉంది. 

పాత పన్ను విధానం కింద చాలా మందికి ఈ 8 హెడ్స్ కింద దాదాపు రూ.లక్ష వరకు సేవ్ చేసుకోవచ్చని తెలియదని పన్ను నిపుణులు చెబుతున్నారు. 

1. Section 80GG
చాలా మంది తమ జీతంలో హెచ్ఆర్ఏ లేనందున దాని మినహాయింపు క్లెయిమ్ చేరని భావిస్తుంటారు. కానీ మీరు అద్దె చెల్లిస్తున్నట్లయితే సెక్షన్ 80జీజీ కింద ఏటా రూ.60 వేల వరకు ఇంటి అద్దె క్లెయిమ్ చేసుకోవచ్చని గుర్తించుకోండి. ఫ్రీలాన్సింగ్ వర్క్ చేసే వారు, కన్సల్టెన్ట్స్ షరతులకు లోబడి ఫారమ్ 10బీఏ సమర్పించి దీనిని పొందవచ్చు. 

2. Section 80CCD(1B)
సెక్షన్ 80సీ కింద గరిష్ఠంగా అందించే రూ.లక్ష 50వేలు మినహాయింపును పొందిన వ్యక్తులు నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద డబ్బు దాచుకోవటం ద్వారా రూ.50వేల వరకు పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. దీని కింద సదరు వ్యక్తి తన మైనర్ పిల్లల పేరుపై చేసే పెట్టుబడిని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. 

3. Section 80G
మీరు చేసే ఛారిటీల ద్వారా కూడా ఇచ్చిన మెుత్తానికి పన్ను మినహాయింపును పొందవచ్చు. ఇందుకోసం రూ.2వేల కంటే పైన చేసిన చెల్లింపులు అర్హత పొందుతాయి. అలాగే డొనేషన్ అందుకున్న వ్యక్తి పాన్ వివరాలను అందించాల్సి ఉంటుంది. 

4. Section 80D
చాలా మంది తాము చెల్లించిన ఆరోగ్య బీమా ప్రీమియం మాత్రమే క్లెయిమ్ చేస్తుంటారు. అయితే మీరు ప్రివెంటివ్ హెల్త్ చెకప్ కోసం చేసిన ఖర్చులో రూ.5వేల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చని సెక్షన్ 80డి చెబుతోంది. 

5. Section 80DD/80DDB
ఇంట్లో ఎవరైనా వికలాంగ కుటుంబ సభ్యుడికి మెడికల్ ఖర్చులకు సెక్షన్ 80DD కింద మీరు రూ.1,25,000 వరకు మినహాయింపుకు అర్హులు కావచ్చు. అదనంగా సెక్షన్ 80DDB క్యాన్సర్, చిత్తవైకల్యం లేదా పార్కిన్సన్స్ వంటి నిర్దిష్ట వ్యాధులకు రూ.లక్ష వరకు తగ్గింపులను అనుమతిస్తుంది.

6. Joint home loan 
మీరు జీవిత భాగస్వామి కలిగి హోమ్ లోన్ తీసుకున్నట్లయితే ఇద్దరూ తమ ఆదాయపు పన్ను ఫైలింగ్ సమయంలో రూ.2లక్షల వరకు వడ్డీ తగ్గింపు, రూ.లక్ష 50వేల వరకు అసలు చెల్లింపుపై వేరువేరుగా తగ్గింపును పొందవచ్చు. అంటే మెుత్తంగా రూ.7 లక్షల వరకు గరిష్ఠ ప్రయోజనాన్ని పొందవచ్చు. 

7. Company-leased car
మీరు పనిచేస్తున్న సంస్థ ద్వారా కారును లీజు రూపంలో తీసుకున్నట్లయితే నెలకు రూ.2వేల 400 అలాగే డ్రైవరును కలిగి ఉన్నందుకు రూ.900 మాత్రమే పన్ను పరిగణలోకి తీసుకోబడుతుంది. అలాగే కంపెనీ చెల్లించే ఈఎంఐ, ఇంధన ఖర్చులు, మెయింటెనెన్స్ పై ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. 

8. Flexi Benefit Plan
ఇక చివరిగా మీరు పనిచేస్తున్న సంస్థ నుంచి పొందుతున్న సీటీసీలో మార్పులు చేసుకోవటం ద్వారా పన్ను మినహాయింపులు పొందవచ్చు. కంపెనీ అందించే మీల్ కార్డ్స్, ఫ్యూయల్ రీఎంబర్స్మెంట్, టెలికాం బిల్, ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ వంటివి మీపై పన్ను భారాన్ని తగ్గిస్తాయని గుర్తుంచుకోండి.