
కన్నడ చిత్రం ‘కాంతార’తో ఆకట్టుకున్న సప్తమి గౌడ.. ‘తమ్ముడు’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం (జులై 04) విడుదలవుతున్న సందర్భంగా సప్తమి గౌడ ఇలా ముచ్చటించింది.
‘‘ఈ చిత్రం కోసం ఫస్ట్ సెలెక్ట్ అయిన ఆర్టిస్ట్‌ను నేనే. అంబరగొడుగు అనే ఊర్లో ఉండే రత్న అనే అమ్మాయి పాత్ర నాది. అనుకోని పరిస్థితుల్లో లయ, నితిన్ ఆ ఊరికి వస్తారు. వారి ప్రయాణంలో రత్న ఎలా భాగమైంది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. సీరియస్ సబ్జెక్ట్‌లో నా పాత్ర ద్వారా ఫన్ క్రియేట్ అవుతుంది. లెంగ్తీ రోల్ కాదు, కానీ ఇంపాక్ట్ ఫుల్ క్యారెక్టర్. నా పాత్రకు ఓ ఆసక్తికరమైన ప్రేమకథ కూడా ఉంది.
చూడ్డానికి ‘కాంతార’లో, ఇందులో ఒకేలా కనిపిస్తా. కానీ క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. రేడియో జాకీ పాత్రేమి కాదు. ఇక నేను అథ్లెట్‌ను కావడం, ఆల్రెడీ ‘కాంతార’ కోసం వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్ వల్ల ఫారెస్ట్ సీన్స్‌లో ఇబ్బంది పడలేదు. ఈ సినిమా కోసమే హార్స్ రైడింగ్ నేర్చుకున్నా. ఆ సీన్స్ చాలా బాగా వచ్చాయి. నాతో పాటు లయ, దిత్య, వర్ష, స్వసిక పాత్రలకు ప్రాధాన్యత ఉంది.
మా ఐదు పాత్రలు డిఫరెంట్, పవర్‌ఫుల్‌గా ఉంటాయి. హీరోకు జంటగా పాటలు పాడుకునేలా కాకుండా ఫైట్ చేసే హీరోయిన్స్‌ను చూస్తారు. నాపై ఓ యాక్షన్ ఎపిసోడ్‌ను సింగిల్ షాట్‌లో చిత్రీకరించారు. ఎగిసిపడుతున్న మంటల మధ్య షూట్ చేయడం కొంత భయం అనిపించింది. కేవలం రెండు టేక్స్‌లో ఆ సీన్ ఓకే అయింది. అలాగే పవన్ కళ్యాణ్ అభిమానిగా కనిపిస్తా.
ఆయన నటించిన ‘తమ్ముడు’ చిత్రం గురించి దర్శకుడు చెప్పారు. త్వరలోనే చూస్తాను. స్వతహాగా నాకు కమర్షియల్ మూవీస్ చేయడం ఇష్టం. కానీ ‘కాంతార’ సక్సెస్ తర్వాత అలాంటి పాత్రలే ఎక్కువ వచ్చాయి. అందుకే చాలా సినిమాలు వదులుకున్నా. ‘పుష్ప’లో రష్మిక చేసిన పాత్ర చాలా నచ్చింది. అలాంటి ఆఫర్స్ వస్తే చేసేందుకు సిద్ధంగా ఉన్నా. ఇక ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలతో పాటు తమిళ, కన్నడ భాషల్లో నటిస్తున్నా’’.