సూపర్ స్పెషాలిటీ దవాఖాన్లు, ప్రజారోగ్యంపై కేసీఆర్‌‌‌‌ సమీక్ష

సూపర్ స్పెషాలిటీ దవాఖాన్లు, ప్రజారోగ్యంపై కేసీఆర్‌‌‌‌ సమీక్ష

హైదరాబాద్‌‌, వెలుగు: కంటి వెలుగు కార్యక్రమం రెండో విడతను వచ్చే ఏడాది జనవరి 18న ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కార్యక్రమ అమలు తీరు, నూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖాన్లు, ప్రజారోగ్యం తదితర అంశాలపై గురువారం ప్రగతిభవన్‌‌లో కేసీఆర్‌‌‌‌ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. ‘‘కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వృద్ధులకు ఈ కార్యక్రమం ఎంతో మేలు చేసింది. పేదల జీవితాల్లో వెలుగులు నింపి వారి ఆనందాన్ని పంచుకోవడం గొప్ప విషయం” అని అన్నారు. గతంలో మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైనోళ్లకు ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేస్తామని చెప్పారు. ఇందుకు అవసరమైన సామగ్రి, సిబ్బందిని సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. 

ఆస్పత్రుల్లో అన్ని సౌలతులు ఉండాలె.. 

వరంగల్, హైదరాబాద్‌‌లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖాన్లలో ఈఎన్‌‌టీ, డెంటల్, ఆప్తమాలజీ విభాగాల కోసం ఒక్కో ఫ్లోర్‌‌‌‌ను కేటాయించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ఈ సందర్భంగా దవాఖాన్ల డిజైన్లను పరిశీలించారు. ఎక్కువ అంతస్తుల్లో ఆస్పత్రులను నిర్మించి, అన్ని విభాగాలకు సౌలతులు కల్పించాలని సూచించారు. మెడికల్ స్టూడెంట్స్‌‌కు చదువు చెప్పేందుకు, పేషెంట్లకు వైద్య సేవలు అందించేందుకు అనుగుణంగా నిర్మాణాలు ఉండాలన్నారు. హనుమకొండలో నిర్మిస్తున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌‌.. కార్పొరేట్ హాస్పిటళ్లకు దీటుగా ఉండాలన్నారు.