
- పరిస్థితులను బట్టి కొన్ని కార్యక్రమాలను రద్దుచేసుకుంటాం
- మంత్రి కొండా సురేఖ
వరంగల్, వెలుగు: అత్యవసర పని ఉండడం వల్లే సోమవారం మేడారంలో నిర్వహించిన జాతర పనుల సమీక్షకు వెళ్లలేదని మంత్రి కొండా సురేఖ తెలిపారు. మంత్రిగా తనకు కొన్ని విధులు, పరిధులు ఉంటాయని, పరిస్థితులకు అనుగుణంగా కార్యక్రమాలు రద్దు చేసుకునే అధికారం తనకుందని చెప్పారు. మంగళవారం హనుమకొండలోని డీసీసీ కార్యాలయంలో సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో ఏఐసీసీ అబ్జర్వర్ నవజ్యోతి పట్నాయక్‍తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లోకల్ బాడీ, కార్పొరేషన్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవాలంటే ఉత్సాహంగా పని చేసే నాయకత్వం అవసరం ఉందన్నారు. అభిప్రాయ సేకరణ గతంలో పీసీసీ వరకే పరిమితం అవగా.. ఈసారి ఏఐసీసీకి ఇవ్వడం మంచి పరిణామమన్నారు. ఓరుగల్లులో మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య రాజకీయ గొడవలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఏంచేస్తారని మీడియా ప్రశ్నించగా.. అది తన డ్యూటీ కాదని ఏఐసీసీ అబ్జర్వర్ నవజ్యోతి పట్నాయక్ తెలిపారు. ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‍రెడ్డి, రేవూరి ప్రకాశ్‍రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, నేతలు వరద రాజేశ్వరరావు పాల్గొన్నారు.