
జనగామ, వెలుగు : జనగామ నియోజకవర్గ పరిధిలో పెండింగ్‌లో ఉన్న దేవాదుల లిఫ్ట్ఇరిగేషన్ పనులను వెంటనే పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని కోరారు. మంగళవారం సచివాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్సమీక్షా సమావేశం నిర్వహించగా, ఎమ్మెల్యే పల్లా పాల్గొని సమస్యలను విన్నవించారు.
తరిగొప్పుల మినీ లిఫ్ట్-1 పైప్ లైన్ పనులు పూర్తి అయినప్పటికీ మరికొన్ని చెరువులకు పైప్ లైన్ వేయాలని కోరారు. పంపు హౌజ్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి రైతులకు సాగునీటిని అందించాలన్నారు. దేవాదుల 8వ ప్యాకేజీలో భాగంగా తపాస్ పల్లి రిజర్వాయర్ నుంచి బచ్చన్నపేట, చేర్యాల మండలంలోని కాల్వలు, కన్నెబోయిన గూడెం రిజర్వాయర్ నుంచి బచ్చన్నపేట, జనగామ మండలాల్లోని అసంపూర్తి కాల్వలను పూర్తి చేయాలని కోరారు.
భూసేకరణ డబ్బులను రైతులకు వెంటనే చెల్లించాలని అన్నారు. జనగామ నియోజకవర్గంలోని 12 చెరువులు ఇబ్బందికరంగా ఉన్నాయని, మరమ్మతులకు నిధులను విడుదల చేయాలని, మల్లన్నసాగర్ నుంచి తపాస్ పల్లి గ్రావిటీ కెనాల్ పనులను పునరుద్ధరించాలన్నారు. వీటికి మంత్రి సానుకూలంగా స్పందించి, పనులను మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.