గిన్నిస్ రికార్డే లక్ష్యంగా కొనసాగుతున్న కంటి వెలుగు

గిన్నిస్ రికార్డే లక్ష్యంగా కొనసాగుతున్న కంటి వెలుగు
  • వంద రోజుల్లో కోటీ 70 లక్షల మందికి టెస్టులు చేయాలని టార్గెట్
  • రోజూ 1,500 క్యాంపులు.. ఒక్కో క్యాంపులో సగటున 140 మందికి పరీక్షలు
  • 3 రోజుల్లో 6.22 లక్షల మందికి టెస్టులు.. వారిలో 43 % మందికి చూపు సమస్య

హైదరాబాద్, వెలుగు: గిన్నిస్ బుక్ రికార్డే లక్ష్యంగా కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతున్నది. వంద రోజుల్లో సుమారు కోటీ 70 లక్షల మందికి టెస్టులు చేయించాలని రాష్ట్ర సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అనుగుణంగానే ఆఫీసర్లు వేగంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోజూ 1,500 క్యాంపులు ఏర్పాటు చేసి కంటి పరీక్షలు చేయిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఒక్కో క్యాంపులో సగటున గంటకు 20 మంది చొప్పున, రోజూ140 మందికి టెస్టులు చేస్తున్నారు. ఈ నెల 18న ఖమ్మంలో కేరళ, పంజాబ్‌‌‌‌, ఢిల్లీ ముఖ్యమంత్రులతో కలిసి సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ అధికారికంగా కంటి వెలుగు రెండో దశను ప్రారంభించారు.ఈ నెల 19న క్యాంపులు ప్రారంభం కాగా.. తొలి రెండ్రోజుల్లో 4,06,433 మందికి టెస్టులు చేశారు. శని, ఆదివారాలు సెలవు కావడంతో క్యాంపులు నిర్వహించలేదు. సోమవారం 1,500 క్యాంపుల్లో 2,16,217 మందికి టెస్టులు  చేశామని ఆరోగ్యశాఖ  ప్రకటించింది. మూడ్రోజుల్లో కలిపి 6,22,650 మందికి పరీక్షలు చేశారు. 

చూపు సమస్య ఉన్నోళ్లు పెరిగిన్రు
రాష్ట్రంలో కరోనా తర్వాత కంటి సమస్యలు ఉన్నోళ్ల సంఖ్య పెరిగినట్లు తెలుస్తున్నది. 2018లో జరిగిన కంటి వెలుగు మొదటి దశలో టెస్ట్‌ చేయించుకున్న ప్రతి వంద మందిలో 32 మందికి చూపు సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. పరీక్ష చేయించుకుంటున్న ప్రతి వంద మందిలో 43 మందికి సమస్య ఉన్నట్లుగా తేలుతున్నది. టెస్టులు చేయించుకున్న 6.22 లక్షల మందిలో 2,67,718 మందికి చూపు సమస్యలు ఉన్నట్లు  గుర్తించారు. 1.53 లక్షల మందికి రీడింగ్ గ్లాసెస్ అందజేశారు. ఇంకో 1.14 లక్షల మందికి, వారి సైటుకు తగ్గ అద్దాలు ప్రిస్క్రైబ్ చేశారు. ఈ మేరకు అద్దాలు తయారు చేయించి, 15 రోజుల్లో అందజేయనున్నారు. మొదటి దశ లెక్కల ప్రకారం ఈసారి 55 లక్షల మందికి అద్దాలు పంపిణీ చేయాల్సి వస్తుందని ఆరోగ్యశాఖ అంచనా వేసింది. కానీ ఈ మూడ్రోజుల లెక్కలు చూస్తే 70 లక్షల మందికి అద్దాలు పంపిణీ చేయాల్సి రావచ్చని  అధికారులు చెబుతున్నారు.