జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పార్టీ పెట్టిన తర్వాత 10 మందితో ప్రేమించబడేలా ఉండాలి కానీ.. వీధి రౌడీలా మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. పవన్ ప్రసంగాల్లో తొక్క తీస్తా,నార తీస్త,చెప్పుతో కొడతానని అంటున్నారని.. ఇలా ఎంతమందికి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను తిట్టడం కోసం సమయాన్ని వృథా చేసుకోవద్దని హితవు పలికారు.
కాపు ఉద్యమానికి పవన్ ఎందుకు మద్దతివ్వలేదని మద్రగడ నిలదీశారు. తాను కులాన్ని అడ్డంపెట్టుకుని నాయకుడిగా ఎదగలేదన్నారు . యువతను వాడుకుని భావోధ్వేగాలు రెచ్చగొట్టలేదన్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా ఉద్యమాలు చేయలేదన్నారు. పవన్ తనకంటే బలమైన నేత కదా? మరి ఎందుకు కాపులకు రిజర్వేషన్ తీసుకురాలేదో చెప్పాలని ప్రశ్నించారు.
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ కుటుంబంపై పవన్ కళ్యాణ్ విమర్శలను ఖండించారు ముద్రగడ. ఎమ్మెల్యే తండ్రిభాస్కర్ రెడ్డి, తాత కృష్ణారెడ్డి తప్పుడు మార్గాల్లో సంపాదించారనడం చాలా తప్పన్నారు. 1988లోనే కాపునాడు సభకు కృష్ణారెడ్డి 100 లారీ పంపించారని.. ఉద్యమం కోసం ఆయన రూ.50 వేల ఖర్చుతో పోస్టర్లు వేయించారన్నారు.