ధనుష్, మమితా బైజు జంటగా విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఐషరి కె గణేష్ నిర్మించిన చిత్రం ‘కర’. ఏప్రిల్ 30న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సతీష్ కమార్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
అతిథులుగా హాజరైన హీరో సాయి దుర్గ తేజ్, దర్శకులు బుచ్చిబాబు సానా, వెంకీ అట్లూరి సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. ఈ సందర్భంగా ధనుష్ మాట్లాడుతూ ‘ఇదొక సాధారణ యువకుడి కథ. కుబేర, ఇడ్లీకొట్టు తర్వాత మళ్లీ తెలుగు ఆడియెన్స్ ముందుకు వస్తున్నా. ఈ చిత్రాన్ని కూడా ఆదరిస్తారని నమ్ముతున్నా’ అని అన్నాడు. ఈ మూవీ తనకెంతో నేర్పిందని హీరోయిన్ మమిత బైజు చెప్పింది.
దర్శకుడు విఘ్నేశ్ రాజా మాట్లాడుతూ ‘నా గత చిత్రం ‘పోరు తొళిల్’ చూసి తెలుగు ఆడియెన్స్ నన్నెంతో ప్రశంసించారు. అదే స్పిరిట్‌తో ‘కర’ తీశా. ఇది ప్రేక్షకులు పెట్టే డబ్బు, సమయం అన్నింటినీ గౌరవించేలా ఉంటుంది. కచ్చితంగా నిరాశపర్చదు’ అని అన్నాడు. సపోర్ట్ చేసిన వారందరికీ నిర్మాత ఐషరి కె గణేష్ థ్యాంక్స్ చెప్పారు. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన కేఎస్ రవికుమార్, తెలుగు డిస్ట్రిబ్యూటర్ సతీష్ కుమార్ ఈ చిత్రం విజయం సాధించాలని కోరారు.

