
ఖమ్మం పట్టణంలోని లకారం ట్యాంక్ బండ్ లో శ్రీ కృష్ణుడు అవతారంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై వివాదం ఇంకా కొనసాగుతోంది. ఈ విగ్రహం ఏర్పాటుపై సినీ నటి కరాటే కళ్యాణి మరోసారి అభ్యంతరం వ్యక్తం చేశారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేయడమంటే ఇదే..ప్రభుత్వ ఆధీనంలో ఉన్న చెరువు నడిబొడ్డున ప్రైవేటు వ్యక్తులు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఏంటి అని ప్రశ్నించారు. తాగునీరు అందించే చెరువులో కాలుష్య మండలి నిబంధనలకు విరుద్ధంగా విగ్రహం పెట్టవచ్చా అని నిలదీశారు. ఎన్టీఆర్ అభిమానులకు అనుమతులు ఇచ్చారు...రేపు వైఎస్ అభిమానులు, కమ్యూనిస్టు అభిమానులతో పాటు కులానికి ఒకరు అడిగితే విగ్రహ ఏర్పాటుకు చెరువులో అనుమతులు ఇస్తారా అని ప్రశ్నించారు.
ప్రపంచంలో ఎక్కడైనా ప్రైవేటు వ్యక్తుల ద్వారా ప్రభుత్వ స్థలంలో దర్జాగా పనులు చేసారా అని కరాటే కళ్యాణి నిలదీశారు. హైదరాబాద్ తరహలో ట్యాంక్ బండ్ పై మహనీయుల విగ్రహలు పెడితే అందరూ ఆస్వాదిస్తారని చెప్పారు. బ్యూటిఫికేషన్ పేరుతో పొలిటికల్ స్టంట్ కోసం ఆడే డ్రామా అని మండిపడ్డారు. లకారం ట్యాంక్ బండ్ ప్రైవేటు వ్యక్తులకు అంటగట్టడానికి అన్నగారి విగ్రహాన్ని బూచిగా చూపిస్తున్నట్లు ఉందని ఆరోపించారు. పర్యావరణాన్ని ప్రైవేటు వ్యక్తుల కోసం నాశనం చేద్దామా అని ప్రశ్నించారు. ప్రైవేటు వ్యక్తులకు అనుమతి ఇచ్చేది ఉంటే ప్రభుత్వం ఎందుకు .. అలా ఇచ్చేది ఉంటే ప్రతి కులం వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.