సకలజన సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ, అందుకు అత్యంత అవసరమైన వరుణదేవుని అనుగ్రహం కలిగి, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఆగస్టు 22 నుండి 26వ తేదీ వరకు కారేరిఇష్ఠి యాగం, వరుణజపం, పర్జన్యశాంతి హోమం నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది.
తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో కారేరిఇష్ఠి యాగాన్ని రుత్వికులు ఆగమోక్తంగా చేయనున్నారు. ఈసందర్భంగా గణపతి పూజతో ప్రారంభించి మహాసంకల్పంతో పూజలు చేశారు. ఈ యాగకర్మ ఏర్పాట్లు ధర్మగిరి వేద విజ్ఞన పీఠం ప్రిన్సిపాల్ కెఎస్ఎస్.అవధాని ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కారేరిఇష్ఠి యాగాన్ని 32 మంది వేద, శ్రౌత, స్మార్థపండితులు, రుత్వికులు ఐదు రోజులపాటు ప్రతి రోజు ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు.
కారేరిఇష్ఠి యాగం ప్రత్యేకత
సాధారణంగా ఏ యజ్ఞయాగాదుల్లోనైనా రుత్వికులు ధవళ లేదా పసుపు రంగుల్లో వస్త్రాలను ధరించి యాగకర్మను నిర్వహిస్తారు. అయితే కారేరి ఇష్ఠి యాగంలో పాల్గొనే వైదికులు నల్లని వస్త్రాలను మాత్రమే ధరిస్తారు. నల్లని మేఘాలను ప్రసన్నం చేసుకోవడానికి ఇలా చేస్తారు. తద్వారా మంచి వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండి దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నదే యాగం ముఖ్య ఉద్దేశ్యం. మరో ఆశక్తికరమైన అంశం ఏమిటంటే ఈ యజ్ఞంలో ఉపయోగించే ప్రతి వస్తువు బియ్యం, తేనే కృష్ణవర్ణంలో ఉంటాయి. కాగా గుర్రాన్ని, గొర్రెను యజ్ఞగుండం అభిముఖంగా ప్రవేశపెట్టి శుభ సూచికగా అవి తలలూపిన తరువాత యజ్ఞకార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
కారేరిఇష్ఠి యాగంలో వరుణ దేవుని అనుగ్రహం కోసం కారేరి ఇష్ఠి జపం , వరుణ జపం, రుష్యశృంగ శ్లోక పారాయణం, విరాటపర్వ పారాయణం, అమృత వర్షినీ వంటి ఐదు ప్రధాన క్రతువులను తి తద్వారా తిరుమలలోని ఆరు ప్రధాన నీటి వనరులైన గోగర్భం, ఆకాశగంగా, పాపవినాశనం, కుమారధార, పసుపుధార, తుంబురతీర్థాలలో వర్షాలు కురిసి నీరు పుష్కలంగా ఉంటుందని రుత్వికులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని 67 ప్రధాన నీటి వనరులైన కృష్ణా, గోదావరి, వంశధార, మూసి, గుండ్లకమ్మ, బహుదా, వేదవతి, కళ్యాణి, హంద్రీనీవా, కొల్లేరు సరస్సు, చిత్రావతి ఇతర నదులలో నీరు చేరి ప్రజలు పాడిపంటలతో సుభిక్షంగా ఉంటాయన్నారు.
వరుణజపం
తిరుమలలో కారీరిష్టి యాగంలో భాగంగా వరుణజపాన్ని శాస్త్రోక్తంగా చేస్తారు. ఇందులో ముందుగా గణపతి పూజతో ప్రారంభించి, కారీరిష్టపూజ, పర్జన్య వరుణ జపం మంత్రాన్ని జపించి వరుణ దేవున్ని ప్రార్థించారు. ఈ యాగంలో 32 మంది రుత్వికులు ఐదు రోజుల పాటు పాల్గొంటారు. ప్రతి రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు యాగ కార్యక్రమాలు జరుగుతాయి. 26న శాంతి హోమం, మహా పూర్ణాహుతితో వరుణ జపం ముగుస్తుంది.
2017వ సంవత్సరంలో టీటీడీ కారేరి ఇష్ఠి యాగాన్ని నిర్వహించింది. ఆ సంవత్సరం రాష్ట్రంలో, దేశంలో విస్తారంగా వర్షాలు కురిశాయన్నారు. అందువల్ల తిరుమలలోని డ్యాంలలో నీరు సమృద్ధిగా చేరిందని చెప్పారు. ఇందులో భాగంగానే ఆగస్టు 22 నుండి 26వ తేదీ వరకు మహానిష్ణాతులైన పండితులతో శాస్త్రోక్తంగా కారేరిఇష్ఠి యాగం , వరుణజపం పర్జన్యశాంతి హోమం నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది.
